గోల్కొండ మీద జెండా వందనమా? న్యాయమా?

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ వివాదాస్పదం అవుతోంది. అసలు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయా లేక వివాదాస్పదం అయ్యే విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. కేసీఆర్ తీసుకున్న మిగతా నిర్ణయాలు, వాటి వివాదాల సంగతి అలా వుంచితే, తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం కలకలం రేపుతోంది. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్.లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం టీఆర్ఎస్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను, జాతీయ జెండా ఆవిష్కరణోత్సవాన్ని గోల్కొండలో చేయాలని నిర్ణయించింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతుంది. ఆ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని గోల్కొండ కోటలో చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.

 

గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరపడం ద్వారా కేసీఆర్ ఏం సాధించదలచుకున్నారో స్పష్టంగా అర్థం కావడం లేదు. ఈ చర్య ద్వారా ఆయన ప్రత్యేకంగా సాధించేదేమీ లేకపోయినా లేనిపోని వివాదాలకు తెరతీస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఇలా చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు రాంగ్ సిగ్నల్ఇస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో అప్పటి టీఆర్ఎస్ నాయకుడు ప్రకాష్ తెలంగాణ ప్రజలు భారతీయులు కాదని, భారత సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుందని వ్యాఖ్యానించారు. అలాగే ఈమధ్యకాలంలో కేసీఆర్ కుమార్తె కవిత ఎంపీ హోదాలో వుండి కూడా హైదరాబాద్‌ విషయంలో, కాశ్మీర్ విషయంలో అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శకులు విమర్శించడానికి అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండలో చేయడం అంటే పాత హైదరాబాద్ సంస్థానాన్ని ప్రజలకు గుర్తు చేసినట్టు అవుతుంది. అది వేర్పాటు వాదానికి సూచిక అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందువల్ల కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎప్పటిలాగానే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్.లోనే చేస్తే ఏ సమస్యా వుండదు.