ఈ సారి పంద్రాగష్టు వేడుకలు గోల్కొండలో కాదట..?

posted on: Jul 25, 2016 5:57PM

ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరిలోకి కేసీఆర్ శైలి భిన్నమైంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో..ఎక్కడ వంచాలో బాగా తెలిసిన వ్యక్తి కేసీఆర్. ఏది.. ఎప్పుడు, ఎందుకు చేయాలో ఆయనకు తెలిసినంతగా మరేవ్వరికి తెలియదు. ఒక నిర్ణయం తీసుకున్నారంటే నరమానవులు దిగివచ్చినా దానిని మార్చలేరు. తాజాగా ఆయన మదిలో ఒక ఆలోచన మెదిలింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతియేటా నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేదిక మార్చాలన్నదే ఆ ఆలోచన. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాకా తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేదికగా గోల్కొండ కోటను ఫిక్స్ చేసి అందిరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అంతేకాకుండా స్వయంగా కోటను పరిశీలించి వేడుకలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనుకున్నట్లుగానే తెలంగాణలో తొలి స్వాతంత్ర్య వేడులకను గోల్కొండ ఖిల్లాలో నిర్వహించి వహ్వా అనిపించుకున్నారు. గత సంవత్సరం కూడా స్వాతంత్ర్య వేడుకలను గోల్కొండ కోటలోనే నిర్వహించి ఈ సంప్రదాయం ఎప్పటికి ఇలాగే సాగుతుందని నిరూపించారు.

 

కానీ ఏమైందో ఏమో కానీ ఈ సారి పంద్రాగష్టు వేడుకల వేదికను గోల్కొండ కోట నుంచి వేరే చోటికి మార్చాలని సీఎం భావిస్తున్నారట. ఈ డౌట్ మాకేందుకు వచ్చిందనేగా మీ డౌట్..స్వాతంత్ర్య దినోత్సవం పట్టుమని ఇంకా 20 రోజులు కూడా లేదు. ఈ పాటికే అక్కడ ఏర్పాట్లు జోరందుకోవాలి..సెక్యూరిటీ చెకింగ్‌లు..అధికారుల హడావిడి ఇలాంటివేవి గోల్కొండ పరిసరాల్లో కనిపించడం లేదు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోనికి తీసుకున్న మీదట వెన్యూ ప్లేస్ మార్చబోతున్నట్లు క్లియర్‌గా అర్థమైపోతుంది. అంతేకాదు పంద్రాగష్టు వేడుకలకు వేదికగా సీఎం అల్రెడి ఒక ప్లేస్ ఫిక్సయ్యారు.

 

అదే జూన్ 2న దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఎగరడానికి వేదికగా నిలిచిన సంజీవయ్య పార్క్ . ఆలోచన వచ్చి రాగానే కొందరు అధికారులతో కలిసి సంజీవయ్య పార్క్‌లో వేడుకలు నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సంజీవయ్య పార్క్‌లో వేడుకలు నిర్వహించడానికి అధికారులకు అనేక ఇబ్బందులు ఎదురు నిలిచాయి. ఒకటి, సంజీవయ్య పార్క్‌ ప్రస్తుతం చెట్లు, అందమైన పూల మొక్కలు, పొదలతో పచ్చగా కళకళలాడుతోంది. వేడుకల కోసం వాటన్నింటిని కూకటి వేళ్లతో సహా పెకలించాలి. రెండవది, ప్రభుత్వం 108 అడుగుల వెడల్పు, 72 అడుగుల ఎత్తుతో జెండాను తయారు చేయించి..దానిని 291 అడుగుల ఎత్తైన ధ్వజస్థంభం సాయంతో ఎగురవేయాలనుకుంటోంది. ఇది ఆచరణలో సాధ్యం కాకపోవచ్చని నిపుణుల అంచనా.

 

రేపు లేదా ఎల్లుండి అధికారులు తమ నివేదికను సీఎంకు అందజేయనున్నారు. ఆయన ఆ నివేదికను పరిశీలించి ఈ వారంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసలు ఉన్నపళంగా సీఎం వేదికను ఎందుకు మార్చాలనుకుంటున్నారు..? ఇది మామూలు జనం నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు మిలియన్ డాలర్ల క్వశ్చన్. కేసీఆర్ ఏది చేసినా దాని వెనుక ఎదో ఒక స్ట్రాటజీ ఉంటుంది. అది మనలాంటి వారికి అర్థం కావాలంటే టైం పడుతుంది.. ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...