మొట్టి కాయలు పడుతున్నా ఎందుకో ఆ దూకుడు?
posted on: Jun 12, 2015 8:56PM
.jpg)
ఈరోజు తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టులో మళ్ళీ మరో ఎదురు దెబ్బ తగిలింది. జెన్‌కో ట్రాన్ప్‌కోలో పనిచేస్తున్న (ఆంద్రప్రదేశ్) స్థానికత ఉన్న1100 మంది ఉద్యోగులను అకస్మాత్తుగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుని నిలిపివేసింది. ఇది తెలంగాణా ప్రభుత్వానికి తల ఒంపులు తెచ్చే ఆదేశాలేనని చెప్పవచ్చును. అయితే తెలంగాణా ప్రభుత్వం ఇంత హడావుడిగా ఎందుకు అటువంటి జీ.ఓ జారీ చేసిందని ఆలోచిస్తే అందుకు కనబడుతున్న కారణం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇటీవల రెండు రాష్ర్ట ప్రభుత్వాల మధ్య యుద్ధం తీవ్రతరమయిన తరువాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడటంతో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్ లో తన నివాసం వద్ద పనిచేస్తున్న తెలంగాణాకు చెందిన పోలీస్ సిబ్బందిని తప్పించి వారి స్థానంలో ఆంధ్రాకు చెందిన పోలీసులను నియమించుకోవడం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానకరంగా భావించడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. అయితే తెలంగాణా ప్రభుత్వం తనపై కూడా నిఘాపెడుతోందనే అనుమానం కలిగినందునే చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయం తీసుకొన్నట్లు అర్ధమవుతోంది.
కానీ ఏకంగా 1100 మంది ఉద్యోగులను బలమయిన ఏ కారణం చూపకుండా వారి బాధ్యతల నుండి తప్పించడం, అది కూడా కేవలం వారి స్థానికత ఆధారంగా చేయడం, పొరుగు రాష్ట్రానికి అప్పజెప్పాలనుకోవడం అన్నీ కూడా ఆహేతుకంగానే ఉన్నాయని ఎవరికయినా అర్ధం అవుతుంది. కానీ ఇవేవీ గమనించకుండా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన పనికి అంతే దీటుగా బడులివ్వాలనుకొన్నారో ఏమో గానీ చాలా హడావుడిగా ఒక జీ.ఓ. ఒకటి జారీ చేసారు. కానీ కేసీఆర్ ఒకటనుకొంటే జరిగింది మరొకటి. ఆ ఉద్యోగులు అందరూ రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసిన ఆ జీ.ఓ.ను కోర్టులో సవాలు చేయడంతో దానిని నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
సుదీర్ఘ కాలంగా ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను అవసరమయితే వేరే జిల్లాకో, విభాగానికో బదిలీ చేయడం సహజమే, కానీ వారిని స్థానికత ఆధారంగా వేరే రాష్ట్రానికి అప్పజెప్పడం సాధ్యం కాదనే చిన్న విషయం తెలంగాణా ప్రభుత్వానికి తెలియకపోవడం చాలా ఆశ్చర్యకరమే!
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో దూకుడు మీద అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొంటుంటే మరి సంబంధిత మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు, న్యాయ సలహాదారులు ఏమి చేస్తున్నారో...ఆయనకు సరయిన సలహా ఎందుకు ఇవ్వలేకపోతున్నారో...లేకపోతే ఆయనే వారిని సంప్రదించడం లేదో...ఏమో తెలియదు కానీ ఆయన ప్రదర్శిస్తున్న ఈ దూకుడు వలన తెలంగాణా ప్రభుత్వం తరచూ కోర్టులో మొట్టికాయలు వేయించుకోకతప్పడం లేదు. ఒక్క ఏడాదిలోనే ఇటువంటి సంఘటనలు కనీసం ఐదారు జరిగి ఉంటాయి. అయినా ఆచితూచి నిర్ణయాలు తీసుకోకుండా ఈవిధంగా దూకుడు ప్రదర్శించడం చాలా ఆశ్చర్యకరంగానే ఉంది!



.jpg)
.jpg)


.webp)


