త్వరలో తెలంగాణా ప్రభుత్వం ఆస్థాన వాస్తు సిద్ధాంతి నియామకం

 

సమాజంలో వ్యక్తులు ఇళ్లు, భవనాలు నిర్మించుకొనేటప్పుడు వాస్తుదోషాలు లేకుండా జాగ్రత్తపడుతుంటారు. అది వారి వ్యక్తిగతం కనుక దానిని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ దీనికి అతీతంగా వ్యవహరించవలసిన ప్రభుత్వాలు కూడా రోడ్లు, భవనాలు, ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు, ప్రస్తుతం ఉన్న భవనాలలో వాస్తు దోషాలను సవరించేందుకు ఆస్థాన వాస్తు పండిట్లను నియమించుకొంటే, ఇక సివిల్ ఇంజనీర్లు ఎందుకు? వారు గీసే డ్రాయింగులు ఎందుకు? అని ఎవరికయినా అనుమానం కలుగకమానదు.

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రముఖ వాస్తు సిద్దాంతి సుద్దాల సుధాకర్ తేజను ఆస్థాన సిద్ధాంతిగా నియమించుకొనేందుకు నిశ్చయించుకొన్నట్లు సమాచారం. కానీ అందుకు చట్టం అనుమతించదు. కనుక, ‘రాష్ట్ర ప్రభుత్వ ఆర్కిటెక్ట్ సలహాదారు’ అనే పేరుతో ఆయనను నియమించు కొనేందుకు ఫైలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఫైలు ఆర్ధిక శాఖ అనుమతి కోసం వేచి ఉందని సమాచారం. రాజుగారు తలచుకొంటే కొరడా దెబ్బలకు కరువా? అన్నట్లు సాక్షాత్ ముఖ్యమంత్రే దానిని ఆమోదించగా లేనిది, ఆర్ధిక శాఖ అంగీకరించదని ఎవరూ భావించలేరు. కనుక ఆయన నియామకం కేవలం లాంచన ప్రాయమేనని భావించవచ్చును. బహుశః మరొక వారం రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడవచ్చునని సిద్ధాంతి గారు ఆశిస్తున్నారు.

 

కానీ ఆయన నియామకానికి రోడ్లు భవనాలు శాఖకు మంత్రిగా నియమితులయిన తుమ్మల నాగేశ్వర రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.25,000 కోట్ల వ్యయంతో హైదరాబాద్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చిన్నా, పెద్ద నిర్మాణాలు జరుగనున్నాయి. ఈ పరిస్థితిలో వాస్తు సిద్ధాంతిని ముందుకు తీసుకురావడం అంటే మంత్రిగారి చేతులు కట్టేసినట్లేనని చెప్పక తప్పదు. ఎందుకంటే రోడ్లు భవనల శాఖ ఇంజనీర్లు ఎన్ని డ్రాయింగులు గీసుకొన్నా వాటికి సిద్ధాంతి గారి ఆమోదముద్ర పడందే ఏ ఫైలు ముందుకు కదిలే అవకాశం లేదు. కనుక అది పరోక్షంగా మంత్రిగారి అధికారాలకు కత్తెర వేసేందుకు చేసిన ఏర్పాటేనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇప్పటికే ఉపముఖ్యమంత్రి రాజయ్యకు ఉద్వాసన పలికిన తీరుకి కేసీఆర్ అనేక విమర్శలు మూటగట్టుకొంటున్నారు. ఇప్పడు వాస్తు సిద్దాంతి నియామకం, ఆయన ద్వారా మంత్రిగారి అధికారాలకు కత్తెర వేసినట్లయితే, మంత్రిగారికి అసంతృప్తి, మరిన్ని విమర్శలు, కోర్టు చివాట్లు కూడా తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu