Latest News

ఫాస్ట్ గానే ముందుకు సాగాలిట!

posted on: Sep 25, 2014 7:44AM

 

తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన ‘ఫాస్ట్’ (ప్రస్తుత ఫీజు రీ ఇంబర్స్ మెంటు స్థానంలో కేవలం తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఆర్ధిక సహాయం అందించే పధకం) జీ.ఒ. పై హైకోర్టు గట్టిగానే మొట్టికాయలు వేసింది. అటువంటి ప్రత్యేకవాద ఆలోచనలు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయని, తెలంగాణా రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమని గుర్తుంచుకొని రాజ్యాంగానికి లోబడి మాత్రమే ప్రభుత్వం చట్టాలు చేయవలసి ఉంటుందని కోర్టు చాలా ఖరాఖండిగానే చెప్పింది. అన్ని రాజకీయ పార్టీలు, మీడియా కూడా కోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని బలంగా సమర్దించాయి. అది తెలంగాణా ప్రభుత్వానికి చెంపదెబ్బ వంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అందువలన ఇక తెలంగాణా ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గుతుందని అందరూ భావించారు.

 

కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై న్యాయపోరాటానికే సిద్దపడుతున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశంపై వెనక్కి తగ్గకూడదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. హైకోర్టులో ప్రభుత్వ వాదనలను బలంగా సమర్ధించుకొనే విధంగా కౌంటర్ దాఖలు చేసేందుకు అవసరమయిన అన్ని వివరాలను సేకరించమని రాష్ట్ర న్యాయశాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కూడా ఈ విషయంలో న్యాయశాఖకు సహకరించవలసిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈసారి హైకోర్టులో ఈ అంశంపై వాదనలు సాగినప్పుడు, అవి కోర్టును ఒప్పించే విధంగా బలంగా ఉండాలని, అందుకు అవసరమయిన అన్ని వివరాలను అన్ని శాఖల నుండి సేకరించామని న్యాయశాఖను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమయితే, ఇప్పటికే కోర్టులలో అనేక ఎదురుదెబ్బలు తిన్న తెలంగాణా ప్రభుత్వం మరోసారి అవమానకర పరిస్థితులు ఎదుర్కోక తప్పదని న్యాయనిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ ఈసారి కూడా హైకోర్టులో పరాభవం ఎదురయితే దానివలన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మరింత మసకబారే ప్రమాదం ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...