తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్

posted on: Feb 16, 2026 3:45PM

 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. సన్న వడ్లు పండించిన రైతులకు పెండింగ్‌లో ఉన్న బోనస్ బకాయిలను విడుదల చేస్తూ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. క్వింటాకు రూ.500 చొప్పున చెల్లించాల్సిన బకాయిలలో భాగంగా మొత్తం రూ.514.36 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులకు ఆర్థిక ఉపశమనం లభించనుంది.

వానకాలం సీజన్‌లో సన్న వడ్లు విక్రయించిన రైతులు ఎంతోకాలంగా బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ మొత్తం నేరుగా జమ కానుంది. ప్రభుత్వం నిర్ణయించిన విధాన ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు అదనంగా ఈ బోనస్ అందించబడుతోంది. దీని వల్ల రైతులకు మరింత గిట్టుబాటు ధర లభించనుంది. రైతుల ఆదాయాన్ని పెంచడం, సన్న వడ్ల సాగును ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ బోనస్ పథకాన్ని కొనసాగిస్తోంది. 

ముఖ్యంగా అధిక నాణ్యత కలిగిన ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చెల్లింపులు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు మొత్తం రూ.1939.58 కోట్ల బోనస్ చెల్లించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తాజా విడుదలతో ఈ సంఖ్య మరింత పెరిగింది. 

రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కావడం వల్ల మధ్యవర్తుల సమస్యలు లేకుండా, పారదర్శకంగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వస్తున్న ఈ ఆర్థిక సహాయం తమకు కొంత ఉపశమనం కలిగిస్తుందని రైతులు చెబుతున్నారు. భవిష్యత్తులో కూడా రైతులకు మద్దతుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...