వేడుకగా తెలంగాణ అవతరణ దినోత్సవ సంబురాలు

posted on: Jun 2, 2026 10:46AM

దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలంగా జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.  స్వరాష్ట్ర కల సాకారమై నేటికి 12 ఏళ్లయ్యింది. ఈ చారిత్రాత్మక తరుణంలో మంగళవారం (జూన్ 2)  తెలంగాణవ్యాప్తంగా అవతరణ సంబురాలు అంబరాన్నంటాయి. పల్లె నుండి పట్నం దాకా ప్రతి ఇల్లూ పండుగ వాతావరణాన్ని తలపించింది. వీధులన్నీ తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో ముస్తాబయ్యాయి. 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారిక వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ పండుగలో భాగస్వాములయ్యారు.ఈ మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ప్రధాన వేదికగా నిలిచింది. అక్కడ అధికారిక వేడుకలు ఉదయాన్నే అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని, అక్కడ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని   ఆవిష్కరించారు.   సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ బెటాలియన్ల పోలీసులు చేసిన మార్చ్ ఫాస్ట్ వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.  జెండా ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 12 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని, సాధించిన విజయాలను  వివరించారు.  రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ పథకాలు, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సరికొత్త ప్రణాళికలను  ప్రజల ముందుంచారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగానే పాలన సాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండ తీవ్రత విపరీతంగా   ఉన్న నేపథ్యంలో వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉదయం 8:30 గంటలకే కార్యక్రమాన్ని ప్రారంభించి, ఎండ ముదరక ముందే ముగించింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...