టీ-కాంగ్రెస్ కి సీమాంధ్ర ప్రజలు మళ్ళీ గుర్తుకు వచ్చేరు

posted on: Sep 16, 2014 11:41AM

 

హైదరాబాదులో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో దిగ్విజయ్ సింగ్ తో సహా కాంగ్రెస్ నేతలందరూ హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రా ప్రజల తరపున తాము నిలబడి పోరాడుతామని, వారి భద్రతకు తమ పార్టీ పూర్తి భరోసా ఇస్తుందని ముక్త కంఠంతో చాలా గట్టిగా చెప్పారు. అయితే ఇదే టీ-కాంగ్రెస్ నేతలు సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన తరువాత తమ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొంటూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రాంతాలలో స్థిరపడిన సీమాంధ్ర ప్రజల పక్షాన్న నిలబడి గట్టిగా మాట్లాడటం వలన తెలంగాణా ప్రజలలో పార్టీ పట్ల వ్యతిరేఖత ఏర్పడి, అది తమ ఓటమికి దారి తీసిందని కనుగొన్నారు. ఆనాడు తప్పుగా కనిపించింది ఈనాడు కాంగ్రెస్ నేతలకు ఒప్పుగా ఎందుకు కనిపిస్తోంది అంటే దానికీ వారి ప్రసంగాలలోనే సరయిన సమాధానం దొరుకుతుంది.

 

త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలందరూ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలలో గెలవాలంటే అక్కడ అత్యధికంగా ఉన్న ఆంద్ర ప్రజల ఓట్లే చాలా కీలకం కానున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చాలా కాలం తరువాత ఆంద్ర ప్రజల భద్రత గురించి మాట్లాడుతోంది. విశ్వనగరం నిర్మించడం అంటే ప్రజల ఇళ్ళు కూల్చి వేయడం, వారిలో అభద్రతా భావం పెంచడం కాదని మాజీ మంత్రి కె.జానారెడ్డి అధికార తెరాస ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. తమ కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులో స్థిరపడిన ఆంద్ర ప్రజలకు అండగా నిలబడుతుందని గట్టిగా చెప్పారు. ఆనాడు తెలంగాణా ప్రభుత్వం ప్రజల ఇళ్ళను కూల్చివేస్తుంటే నోరు మెదపని కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు తాపీగా ఆ విషయం ప్రస్తావించి, తాము ప్రజలకి అండగా నిలబడుతామని కాంగ్రెస్ నేతలు చెప్పడం కేవలం గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చెపుతున్న ఒట్టొట్టి మాటలేనని అర్ధమవుతూనే ఉంది.

 

కాంగ్రెస్ నేతల మాటలలో విశ్వసనీయత, చిత్తశుద్ధి కొరవడినందునే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించాఋ. కానీ వారు నేటికీ అది గ్రహించకుండా మళ్ళీ అదే ధోరణిలో వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. వారు తమ ఈ తీరు మార్చుకోనంతకాలం ఈ విధంగా భ్రమలలోనే బ్రతకవలసి ఉంటుందనే సంగతి ఇంకా ఎప్పటికి గ్రహిస్తారో? పాపం కాంగ్రెస్ నేతలు!

google-ad-img
    Related Sigment News
    • Loading...