Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇద్దరు మంత్రుల పనితీరు కేసీఆర్‌కి నచ్చలే...
posted on: Oct 17, 2014 5:20PM
.jpg)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అందరూ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు... మంత్రి పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నాయకులు అందరూ! కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ ఇవాళ రేపు అంటూ చాలారోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన ఇరవై రోజుల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో తమకు ఛాన్స్ వుంటుందని చాలామంది ఆశిస్తున్నప్పటికీ ఎవరికి అవకాశం దక్కుతుందో చివరి నిమిషం వరకూ తెలిసే అవకాశం కనిపించడం లేదు. అయితే కేసీఆర్ తన మంత్రివర్గంలో దక్షిణ తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి మంత్రిపదవి వదులుకుని వచ్చి మరీ టీఆర్ఎస్‌లో చేరిన మహబూబ్ నగర్ జిల్లా నాయకుడు జూపల్లి కృష్ణారావుకు, తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఖమ్మం జిల్లా నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు, జడ్చర్ల ఎమ్మల్యే లక్ష్మారెడ్డికి మాత్రం ఈసారి తప్పకుండా మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం వుందని భావిస్తున్నారు. ఎప్పటి నుంచో పదవి ఇస్తామని ఊరిస్తున్న ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీప్రసాద్‌కి కూడా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందా లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. తుమ్మలతో పాటు దేవీప్రసాద్ కూడా ఏ సభలోనూ సభ్యుడు కాదు. ఇద్దరికీ ప్రస్తుతానికి మంత్రిపదవులు ఇచ్చేసి, ఆ తర్వాత ఇద్దర్నీ కౌన్సిల్ సభ్యులు చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
మంత్రివర్గ విస్తరణ సంగతి ఇలా వుంటే, ప్రస్తుతం తన కేబినెట్‌లో కీలక మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇద్దరి పనితీరు పట్ల కేసీఆర్ పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ తన మంత్రివర్గం అద్భుతంగా పనిచేయాలని ఆశించారు. అయితే పరిస్థితులు అందుకు విరుద్ధంగా వున్నాయి. మంత్రులు పనిచేయడానికి అవకాశాలు తక్కువగా వున్నాయి. అయినప్పటికీ మంత్రులు సాధ్యమైనంత మేరకు తమ పనితీరుతో కేసీఆర్ని మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇద్దరు మంత్రులు మాత్రం పరమ నాసిరకమైన పనితీరును కనబరుస్తున్నారని, వారి పనితీరు మీద కేసీఆర్‌కి అనేక ఫిర్యాదులు కూడా అందాయని తెలుస్తోంది. కేసీఆర్ కూడా ఆ ఇద్దరు మంత్రులకు పనితీరు విషయంలో ప్రైవేట్‌గా, పబ్లిగ్గా క్లాసులు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఈ ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశాలు అయితే లేవుగానీ, ఈ ఇద్దరినీ అంతగా ప్రాధాన్యం లేని శాఖలకు, ఎంతమాత్రం పనిచేయకపోయినా నడిచిపోయే శాఖలకు మార్చాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.






