చంద్రబాబు నామస్మరణలో తరిస్తున్న ఆ ఇద్దరూ

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడయినా తలుచుకోవడం మరిచిపోవచ్చేమో గానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఆయన నిత్య నామస్మరణ చేస్తూ తరించిపోతున్నారు. వారిలో ఒకరు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కాగా, మరొకరు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. వారిరువురూ కూడా ఆయన నామ స్మరణ చేయనిదే రెండు ముక్కలు కూడా మాట్లాడరు. అది చంద్రబాబు అదృష్టమో ఏమో తెలియదు మరి. తెలంగాణా ప్రభుత్వం అన్నిటికీ చంద్రబాబునే నిందించడం అలవాటుగా మార్చుకొందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సమస్యలు ఉంటే కూర్చొని చర్చించుకోవాలే గానీ ఈవిధంగా ఎవరినో ఒకరిని నిందించడం వలన సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు.

 

మరో రకంగా చెప్పాలంటే కేసీఆర్ తన సమస్యలన్నిటికీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, దాని ముఖ్యమంత్రి చంద్రబాబుని ఒక ‘సర్వరోగ నివారిణి’లా వాడుతున్నట్లున్నారు.

 

అయితే సమస్య ఉందని తెలిసినప్పుడు దానికి పరిష్కారం కోసం వెతకాలి తప్ప చంద్రబాబును నిందిస్తూ కాలక్షేపం చేసినంత మాత్రాన్న అది పరిష్కారం కాబోదని తెదేపా నేత రేవంత్ రెడ్డి హితవు చెప్పారు. తెదేపా నేతలు ఈ మాటలు చెపుతున్నారు కనుక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని పట్టించుకోకపోవచ్చు. గానీ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఇదేవిధంగా మరి కొంత కాలం కొనసాగినట్లయితే అప్పుడు తెలంగాణా ప్రజలు కూడా ఇదే మాట అనే అవకాశం ఉంది.