మరీ ఇంత వాస్తు నమ్మకాలా?
posted on Jan 28, 2015 10:47PM
.jpg)
ఈ మధ్య తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తుకి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లుంది. అందుకే ఏకంగా ఒక ఆస్థాన వాస్తు సిద్ధాంతి సుద్దాల సుధాకర్ తేజని ‘ప్రభుత్వ ఆర్కిటెక్ట్ సలహాదారు’ పేరుతో నియమించుకోవాలని నిర్ణయించుకొన్నారు. అంతే కాదు, వాస్తు ప్రకారం తన క్రింద పనిచేసే అధికారుల కంటే తన అధికార నివాసం ఉన్నత స్థానంలో ఉండాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ల్యాండ్స్ లో ఐ.ఏ.యస్. అధికారుల సంఘం కార్యాలయాన్ని ఖాళీ చేయించి అందులోకి తను మారాలని నిర్ణయించుకొన్నారు. ఆవిధంగా వారి కంటే తను ఉన్నత స్థానంలో ఉండటం వలన వారందరు తన ప్రభుత్వంపై పెత్తనం చేసే బదులు, తానే వారిపై పెత్తనం చేస్తారని వాస్తు సూచిస్తోందిట.
అయితే ఆ విషయం బయటకు చెప్పుకొంది కాదు కనుక అందుకోసం వేరే ఏవో కుంటి సాకులు చెప్పుకోవచ్చును. వాస్తు కోసం కేసీఆర్ ఆభావనంలోకి మారాలని కేసీఆర్ చాలా పట్టుదలగా ఉన్నప్పటికీ, దానికి అనేక అవరోధాలున్నాయి. గత ప్రభుత్వం 2000సం.లో ఆ భవనాన్ని ఐ.ఏ.యస్. అధికారుల సంఘానికి 33 సం.లు లీజు క్రింద ఇచ్చింది. అంటే వారికి మరో 18స.లు పైనే దానిపై హక్కులు ఉంటాయి. కనుక వారు అభ్యంతరం చెప్పవచ్చును. అది ఆంద్ర, తెలంగాణా ఐ.ఏ.యస్. అధికారుల సంఘానికి చెందిన ఉమ్మడి భవనం కనుక ఆంధ్రాకు చెందిన అధికారులు గవర్నర్ నరసింహన్ న్ని కలిసి ఆయనకి దీని గురించి మొరపెట్టుకొన్నారు. హైదరాబాద్ నగరం మరో తొమ్మిదిన్నరేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది కనుక, రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 8(1) ప్రకారం హైదరాబాద్ పరిధిలో ఉన్న భవనాల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకొనే హక్కు ఒక్క గవర్నరుకు మాత్రమే ఉంటుంది. కానీ వారి అభ్యర్ధనకు ఆయన స్పందించారో లేదో తెలియదు గానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం వారి కార్యాలయాన్ని అక్కడి నుండి వేరే చోటికి తరలించి, అందులోకి తను మారాలని భావిస్తున్నారు. అందుకోసమే రోడ్లు మరియు భవనాల శాఖ ఆ భవనం వెనుక ఉన్న 4ఎకరాల ఖాళీ స్థలాన్ని చదునుచేసి శుభ్రం చేయడం మొదలుపెట్టింది కూడా.
ఇది కాక మరో సమస్య కూడా ఉంది. దాదాపు 125సం.ల చరిత్ర కలిగిన ఆ భవనాన్ని 2006సం.లో సాంస్కృతిక సంపదగా ప్రకటించబడింది. అందువలన సంబంధిత శాఖ నుండి అనుమతి పొందవలసి ఉంటుంది. వాస్తు చూసుకొని కేసీఆర్ ఆ భవనంలోకి మారాలని ప్రయత్నిస్తే, ఇన్ని సమస్యలు స్వాగతం పలకడానికి సిద్దంగా ఉన్నాయి. కనుక ఒకవేళ ఏ కారణం చేతయినా ఆయన అందులోకి మారలేకపోయినా, ఆ భవనాన్ని ఉపయోగించుకొంటున్న అధికారులను అక్కడి నుండి ఖాళీ చేయించి, వారికి తన అధికార నివాసానికి వాయవ్యంలో కొంచెం దిగువగా ఉండే మరో భవనాన్ని కేటాయించాలని తద్వారా వాస్తు బ్యాలన్సింగ్ సరిచూసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. వినడానికి ఇదంతా చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ త్వరలోనే ఈ తంతు అంతా పూర్తి అయ్యే అవకాశాలున్నాయి.