Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ధరణి అక్రమాలపై దర్యాప్తునకు సిట్.. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం..!
posted on: Jul 17, 2026 9:34PM
.webp)
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికతో లేఖ రాయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. పంటల సాగు, వ్యవసాయ అనుబంధ రంగాలు, తాగునీరు, సాగునీటి ఇబ్బందులు, ఉపాధి కూలీల పరిస్థితులను వివరించడంతో పాటు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరనుంది. అలాగే ఎల్‌నినో కంటింజెన్సీ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేయనుంది.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో దాదాపు 40 శాతం వర్షపాతం లోటు నమోదైన నేపథ్యంలో తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సరఫరాపై ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు వెంటనే సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా అన్ని శాఖలు ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని మంత్రివర్గం ఆదేశించింది. అలాగే ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు కొనుగోలుకు కూడా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించింది. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యంగా కేటాయించాలని నిర్ణయించింది.
ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు కేబినెట్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని, వర్షాభావ పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి వనరులు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది.
రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి సారథ్యంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఎల్‌నినో ప్రభావంపై నివేదిక రూపొందించాలని సూచించింది. రాష్ట్ర పరిస్థితులకు అనువైన పంటలు, రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు, పశుసంరక్షణ చర్యలపై సిఫార్సులు చేయాలని కోరింది.
అన్ని జిల్లాల్లో అత్యవసర సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, ఈ నెల 20వ తేదీ సోమవారం ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాకు ఇన్‌చార్జి మంత్రితో పాటు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని కూడా నిర్ణయించింది. ప్రకృతి విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
2. ధరణి అక్రమాలపై ప్రత్యేక విచారణ
ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల రికార్డులు, క్రయవిక్రయాలకు సంబంధించిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందం (SET) ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది.
2020 అక్టోబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ, అసైన్డ్, ప్రభుత్వ భూముల బదలాయింపులతో పాటు అన్ని అనుమానాస్పద లావాదేవీలను లోతుగా పరిశీలించాలని నిర్ణయించింది.
ఇప్పటికే నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో దాదాపు 10 వేలకుపైగా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన నేపథ్యంలో డిజిటల్ రికార్డులు, లాగిన్ వివరాలు, రికార్డుల్లో మార్పులు, అధికారుల అనుమతులు, భూముల వర్గీకరణ మార్పులు, లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించింది. ధరణి నిర్వహణ బాధ్యతలు చేపట్టిన IL&FS సంస్థ పాత్ర, టెండర్ ప్రక్రియ, కాంట్రాక్టు కేటాయింపు, పోర్టల్ రూపకల్పన, సిస్టమ్ ఆర్కిటెక్చర్, డేటా భద్రతలో లోపాలపై కూడా విచారణ జరపాలని కేబినెట్ నిర్ణయించింది.
ధరణి స్థానంలో భూభారతి అమల్లోకి వచ్చినప్పటికీ, పాత సాఫ్ట్‌వేర్‌లోని లోపాల కారణంగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్న మంత్రివర్గం, బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక విచారణ బృందం ద్వారా వారిని గుర్తించాలని నిర్ణయించింది.
3. ఇంజినీరింగ్ పనులకు యూనిఫైడ్ విధానం
ప్రభుత్వ ఇంజినీరింగ్ పనుల్లో అంచనా వ్యయాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రైజల్ నుంచి ప్రాజెక్టు ప్రతిపాదనలు, భూసేకరణ, టెండర్లు, బిల్లుల చెల్లింపుల వరకు ఏకీకృత విధానం రూపొందించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
దీనికోసం ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి ప్రాజెక్టుల రూపకల్పన, భూసేకరణ, ల్యాండ్ అసెంబ్లీ, కొనుగోళ్లు, కాంట్రాక్టు నిర్వహణ తదితర అన్ని దశలను సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించింది.
4. మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు అవకాశం
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019లో సవరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
5. గ్రామపంచాయతీ నిధుల నిర్వహణ
గ్రామపంచాయతీ నిధులను ఇకపై ట్రెజరీతో పాటు సమీపంలోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేసుకునేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
6. హైస్పీడ్ రైల్ కారిడార్లు
హైదరాబాద్–ముంబై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–అమరావతి–తిరుపతి–చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ల అలైన్‌మెంట్లు, స్టేషన్ల స్థానాలను ఆర్ అండ్ బీ శాఖ కేబినెట్‌కు వివరించింది. శంషాబాద్ సమీపంలో రైల్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మూడు బుల్లెట్ రైల్ కారిడార్లకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది.
7. ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకం
ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం) పూర్తి చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గోదావరి నదిపై కన్నెపల్లి నుంచి 4.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసి మంథని నియోజకవర్గంలోని 45 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మిగిలిన పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పూర్తయిన పనులను సమీక్షించి, మిగిలిన పనులకు అవసరమైన ఆమోదం ఇచ్చింది.
Telangana Cabinet meeting, El Nino, CM Revanth reddy, Dharani Portal, SIT, High-speed rail corridors





