రాజ్యసభ రాజకీయం!

 

 

 

ప్రస్తుత లోక్‌సభ చివరి సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ఆమోదించేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సభని జరగనివ్వమని, బిల్లుకు అడ్డుపడిపోతామని సీమాంధ్ర ఎంపీలు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం సభను సజావుగా నడిపితేనే బిల్లుకు మద్దతు వుంటుందని చెబుతుంది. ఇదిలావుంటే ప్రభుత్వం కూల్‌గా ఈనెల 10న రాజ్యసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించింది.

 

ప్రస్తుతం తెలంగాణ బిల్లు చుట్టూ ఏర్పడిన పరిస్థితులను చూస్తే ఈ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించేలా చేసి, లోక్‌సభలో బిల్లుకు జెల్లకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసుకోవడం ద్వారా తెలంగాణ ప్రాంతాన్ని, లోక్‌సభలో బిల్లుకు చిల్లు వేయడం ద్వారా సీమాంధ్ర ప్రాంతాన్ని సంతృప్తి పరచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతానికి ఈ గండాన్ని ఇలా గట్టెక్కించి మిగతా విషయాన్ని వచ్చే ఎన్నికల తర్వాత చూసుకోవచ్చనే యోచనలో కేంద్రం ఉన్నట్టు భావిస్తున్నారు.



ఎన్నికలలో తమను గెలిపిస్తే లోక్‌సభలో కూడా బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటామని చెబుతూ తెలంగాణ ప్రాంత ఓటర్లకి గాలం వేసే ఉద్దేశంలో ఇటు కాంగ్రెస్‌తోపాటు అటు బీజేపీ కూడా వున్నట్టు తెలుస్తోందని అంటున్నారు. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లుకు కాలదోషం పట్టదు కాబట్టి తెలంగాణ సమస్య అనే రావణ కాష్టాన్ని శాశ్వతంగా కాలుతూ వుండేలా చూడటం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ వ్యూహంలా వుందని పరిశీలకులు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu