35లక్షల మందికి ఆసరా ఫించన్లు... 529 గురుకుల పాఠశాలు
posted on: Mar 22, 2017 11:20AM

అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు ఇస్తున్నట్లు తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీలో ప్రకటించారు. 35లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నామన్న జూపల్లి.... పింఛన్ల విషయంలో మానవీయ కోణంలో ముందుకెళ్తున్నామన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఏప్రిల్ నుంచి ఒంటరి మహిళలకు ఫించన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే వికలాంగ పింఛన్ల కోసం 9లక్షల 33వేల దరఖాస్తులు వస్తే... 6లక్షల 37వేల మందిని అర్హులుగా నిర్ధారించి పెన్షన్లు ఇస్తున్నట్లు సభలో ప్రకటించారు. ఎవరూ ఇబ్బందులు పడకుండా ఫించన్లను పోస్టాఫీసుల ద్వారా అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఇక కొత్తగా వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుని పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు.
ఇక తెలంగాణలో విద్యా వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వివరించారు. రాష్ట్రంలో కొత్తగా 529 గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గతేడాది 5వేల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామన్న కడియం.... ఈ ఏడాది మరో 5వేల స్కూళ్లను ఇంగ్లీష్ మీడియానికి మార్చుతామన్నారు. తెలంగాణలో 7లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, ఇది చాలా గొప్ప విషయమన్నారు.
అంగన్‌వాడీలను ప్రైమరీ స్కూళ్లలోనే నడిపించాలనే ఆలోచన చేస్తున్నట్లు కడియం శ్రీహరి సభలో తెలిపారు. విద్యా వ్యవస్థ పటిష్టానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని, పేద మధ్యతరగతి విద్యార్ధుల విద్యపై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో విపక్షాలు అర్ధం చేసుకోవాలన్నారు.



.jpg)



.webp)


