కాలుష్యంలో...నిమజ్జనం అవుతోన్న హుస్సేన్ సాగర్!
posted on Feb 8, 2017 5:26PM

హుస్సేన్ సాగర్ కలుషితం అవుతోంది. ఇది ఎంత మాత్రం సహించరాని విషయం.... ఈ మాటలు ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? కరెక్టే, మనం ప్రతీ యేటా వినాయక నిమజ్జనం అప్పుడు ఒక్కసారి ఆచారం కోసం హుస్సేన్ సాగర్ కాలుష్యం గురించి మాట్లాడుకుంటాం. కొందరైతే ఉత్సాహంగా కోర్టుకు వెళతారు. వినాయక విగ్రహాలు నీళ్లలో నిమజ్జనం చేయోద్దని కోర్టు చేత చెప్పించాలని చూస్తారు. కాని, యధావిధిగా విగ్రహాల నిమజ్జనం జరిగిపోతూనే వుంటుంది. కాని, అసలు హుస్సేన్ సాగర్ మామూలు సమయాల్లో ఎలా వుంటోంది? ఏడాకి ఒకసారి జరిగే నిమజ్జన కాలుష్యం సరే... ఏడాదంతా జరిగే ఇతర కాలుష్యాల మాటేంటి? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుంటే యదార్థ పరిస్థితి దారుణంగా ఎదురవుతుంది కళ్ల ముందు!
తాజాగా చేసిన అధ్యయనాల ప్రకారం హుస్సేన్ సాగర్ మృత చెరువు అని తేలిపోయింది! అంటే, చెరువులో నీళ్లు లేక ఎండిపోయిందని కాదు! అందులో వున్నవి నీళ్లలా కనిపంచే విషమని! హైద్రాబాద్ నడిబొడ్డున వున్న మన చారిత్రక చెరువు సాధారణంగా ఎండాకాలం వచ్చిన కొద్దీ దుర్వాసనతో స్వాగతం పలుకుతుంది. దీనికి కారణం, సంవత్సరానికి ఒకసారి పర్యావరణ ప్రేమికులు హడావిడి చేసే వినాయక నిమజ్జనం కాదు! ప్రతీ రోజు, ప్రతీ గంట, ప్రతీ నిమషం హుస్సేన్ సాగర్ లోకి వచ్చి చేరే కలుషిత నీరు. బంజారా హిల్స్ నుంచి సికింద్రాబాద్ దాకా, కూకట్ పల్లి నుంచీ బాలాపూర్ దాకా ఎక్కడెక్కడి నీరో ఇందులో వచ్చి కలుస్తుంటుంది. దీని వల్ల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా తయారైందంటే... నిపుణులు చెబుతోన్న దాని ప్రకారం... హుస్సేన్ సాగర్ తాను సహజంగా శుద్ది చేసుకునే శక్తిని కోల్పోయిందట. చెరువు కింద భూమిలో మీటర్ల కొద్దీ వ్యర్థాలు, ఖనిజాలు ఇంకిపోయాయట! ఫలితంగా ఎండాకాలం రాక ముందే హుస్సేన్ సాగర్ లోంచి కంపు వ్యాపిస్తోంది. రాజధాని మధ్యలో అంద విహీనంగా కొట్టుమిట్టాడుతోంది!
తెలంగాణ ఏర్పాటుకి ముందు, తరువాత కూడా బోలెడు సార్లు హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అన్నారు. కాని, ఇంత వరకూ ఒక్క చుక్క నీరు స్వచ్ఛంగా మారింది లేదు. మరోసారి వినాయక నిమజ్జనం సమయంలో వివాదం రాజుకోవటం తప్ప సంవత్సరం పొడవునా జరుగుతోన్న కాలుష్యం పట్టించుకుంటున్న వారు ఎవరూ లేరు! ప్రభుత్వం, ఎన్జీవోలు, ప్రజలు... 365 రోజులూ హుస్సేన్ సాగర్ ని రక్షించుకునే పనిలో వుంటే తప్ప మన పురాతన సరోవరాన్ని కాపాడుకోలేం!