Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో... దీపావళి నుంచీ సెకండాఫ్?
posted on: Oct 15, 2016 10:42AM

ప్రజల దృష్టిలో ప్రభుత్వం అంటే తమ సంక్షేమం, అభివృద్ధి చూసే వ్యవస్థ. కాని, నేతల దృష్టిలో ప్రభుత్వం అంటే పదవులు, అధికారాలు, బుగ్గ కార్లు... ఇంతే! ఇది అన్ని రాష్ట్రాలకు, కేంద్రానికి కూడా వర్తిస్తుంది. అందుకే, ఎక్కడ ఏ పార్టీ ప్రభుత్వం వున్నా అయిదేళ్లూ పదవుల పందెం నడుస్తూనే వుంటుంది. ముఖ్యమంత్రినో, ప్రధానినో ప్రసన్నం చేసుకుని మంత్రులమైపోవాలని ఎమ్మేల్యేలు, ఎంపీలు తహతహలాడుతుంటారు. ఇప్పుడు ఆ వంతు తెలంగాణ అధికార పక్షం నాయకులకు వచ్చినట్టు కనిపిస్తోంది...
తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. అప్పుడే రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. అయితే, సీఎం కేసీఆర్ పాలనలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ప్రమాణస్వీకరం చేసిన కొత్తలో రాష్ట్రం మొత్తం హెలికాప్టర్ వేసుకుని తిరగటం మొదలు మొన్న దసరాకి జిల్లాలు విభజించటం వరకూ ఆయన తనకు తోచినవన్నీ చకచకా చేసుకుంటూపోతున్నారు!
కేసీఆర్ పాలనలో, పాలసీల్లో కొత్తదనం తీసుకువస్తున్నా క్యాబినేట్ లో మాత్రం పెద్దగా సంచలనాల జోలికి పోవటం లేదు. అసలు ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో క్యాబినేట్ పునర్ వ్యవస్థీకరణ జరగలేదు. అంతే కాదు, పదే పదే మహిళా మంత్రి ఒక్కరు కూడా లేరని విమర్శలు వస్తున్నా పట్టించుకోవటం లేదు. అయితే, ఎట్టకేలకు క్యాబినేట్ పై కూడా సీఎం దృష్టి పడిందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. దసరాకు జిల్లాల హంగామా నడిస్తే దీపావళికి క్యాబినేట్ పునర్ వ్యవస్థీకరణ కోలాహలం వుంటుందంటున్నారు!
క్యాబినేట్లో కదిలిక అంటే ఖచ్చితంగా కొందరికి ఎంట్రీ, కొందరికి ఎగ్జిట్ వుంటుందనే కదా? కేసీఆర్ కూడా అదే మూడ్ లో వున్నారట. కొందర్ని 2019 ఎన్నికల కోసం పార్టీ పనులకి కేటాయించాలని నిర్ణయించారంటున్నారు! అలాగే, కొంత మంది కొత్త వార్ని బుగ్గ కార్లు ఎక్కించే ఆలోచనలో కూడా వున్నారట. వాళ్లెవరు? వీళ్లెవరు? ఇప్పుడే తెలియదు! కాని, దీపావళి నాటికల్లా దాదాపుగా క్యాబినేట్ రీషఫుల్ బాంబు పేలనుందని ఇన్ సైడ్ టాక్.
ఒట్టి మంత్రి పదువులే కాదు అధికార పక్షంలో వున్న చాలా మంది నేతలు ఆశించే నామినేటెడ్ పోస్టులు కూడా కేసీఆర్ టేబుల్ పైకి వచ్చే ఛాన్స్ వుందంటున్నారు. మార్కెట్ కమిటీలు మొదలు దేవాలయ కమిటీల దాకా అన్నిట్లో గులాబీ నేతలకి పోస్టింగ్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందట!
దీపావళి నాటికి నిజంగా తెలంగాణలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగితే అది పెద్ద న్యూసే. కాకపోతే, కేసీఆర్ సంగతి తెలిసిన వాళ్లు మాత్రం ఆయన ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పలేం అంటున్నారు. ఆల్రెడీ దసరాకి కొత్త జిల్లాలతో రాష్ట్రం రూపు రేఖలు మార్చిన ఆయన దీపావళికి క్యాబినేట్ రూపు రేఖల్ని కూడా మార్చవచ్చు అంటున్నారు! చూడాలి మరి....






