విమోచనమా? విద్రోహమా? అవతరణమా?
posted on Sep 18, 2015 11:36AM

సెప్టెంబర్ 17, తెలంగాణ చరిత్రలో ఇదో ముఖ్యమైన తేదీ, హైదరాబాద్ సంస్ధానం భారత్ యూనియన్‌లో కలిసి రోజు, దాదాపు 2వందల ఏళ్లపాటు సాగిన నిజాం నిరంకుశ పాలన అంతరించి, తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు, తెలంగాణ చరిత్రలో ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సెప్టెంబర్ 17పై 67ఏళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. కొందరు విమోచనమంటుంటే, మరికొందరు విద్రోహదినమంటున్నారు, ఇవన్నీ ఎందుకు జూన్ 2న తెలంగాణ అవతరణం ఉందిగా అంటున్నారు ఇంకొందరు.అయితే గతంలో ఉద్యమ పార్టీగా ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండుసార్లు సెప్టెంబర్ 17 వచ్చివెళ్లిపోయింది కానీ, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ మాత్రం అలాగే ఉంఢిపోయింది.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు, ఉద్యమ పార్టీగా ఉండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా టీఆర్ఎస్ నేతలందరూ, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని డిమాండ్ చేసినవాళ్లే, మరి ఇప్పుడు వాళ్లే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు?, ప్రతిపక్షాలు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది?
అయితే హైదరాబాద్ సంస్థానాన్ని బలవంతంగా ఇండియన్ యూనియన్ లో విలీనం చేసుకున్నారని, పైగా శాంతిభద్రతల పేరుతో అప్పటి భారత ప్రభుత్వం... సైనికులతో ముస్లింలపై దాడులు చేయిందని,అందుకు నిరసనగా సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పాటించాలని మజ్లిస్ నేతలు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ కి చిక్కులు తెచ్చిపెట్టింది.తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ముస్లింలను మరింత దగ్గర చేసుకునేందుకు, అవకావం దొరికినప్పుడల్లా నిజాంను పొగుడుతున్న సీఎం కేసీఆర్, విమోచన దినోత్సవాన్ని కూడా పక్కనపెట్టేశారు. అయినా జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉండగా, వేరే ఉత్సవాలు అధికారికంగా ఎందుకంటూ తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు సెప్టెంబర్ 17కి మరో కొత్త భాష్యం చెప్పారు, రాజరిక పాలన అంతమై, ప్రజాస్వామ్య పాలన ఆరంభమైన రోజంటూ టీఆర్ఎస్ లీడర్స్ వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట, అధికారంలో ఉండగా మరో మాట మాట్లాడటం రాజకీయ పార్టీలకు అలవాటే అయినా, ఉద్యమ పార్టీ టీఆర్ఎస్, ప్రజల తరపున పోరాడే ప్రజాసంఘాలు కూడా తమ అభిప్రాయాలను మార్చుకోవడం దురదృష్టకరం. గతంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరిన వాళ్లే ఇవాళ అధికారంలో ఉన్నా, దాన్ని అమలు చేయకపోగా, ఆనాడు టీఆర్ఎస్ తో కలిసి ఆందోళనలు, ధర్నాలు, డిమాండ్లు చేసిన కోదండరాం లాంటి నేతలు కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు. తెలంగాణ విమోచన దినోత్సవంపై ఏకాభిప్రాయం కావాలన్న ఆయన, ఎలా స్పందించాలో తెలియక ఇబ్బందిపడ్డారు. కేసీఆర్ పార్టీ స్టాండ్ మార్చేయడంతో, ప్రభుత్వానికి నొప్పి కలగకుండా కోదండరాం మాట్లాడిన తీరును జేఏసీ నేతలే ఆక్షేంపించారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని డిమాండ్ చేసిన కేసీఆర్, ఇప్పుడు అధికారంలో ఉన్నా ఎందుకు నిర్వహించలేదంటూ నిలదీయాల్సిపోయి, ఈ నసుగుడు ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉంటే ఒక మాట, లేకుంటే మరో మాట... ఇది పార్టీలకూ అలవాటేనని, అందుకే కాంగ్రెస్ కూడా ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా డిమాండ్ చేస్తుందని గుర్తుచేస్తున్నారు. అయితే ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్, ఫక్తు రాజకీయ పార్టీగా మారి, అధికారంలోకి వచ్చాక మాత్రం వ్యూహాత్మకంగా పక్కన పెట్టేసిందని అంటున్నారు.
అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. పోరాటాలతో తెచ్చుకున్న స్వరాష్ట్రం తెలంగాణలో కూడా కనీసం విమోచన దినోత్సవం జరిపే పరిస్థితి లేదా అంటూ వాపోయారు.ఓట్ల రాజకీయం కోసం పాకులాడుతున్న కేసీఆర్...చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని దుమ్మెత్తిపోస్తున్నారు.