ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రతిపక్షాల హితవు

 

ఈరోజు జరిగిన శాసనసభ సమావేశాలలో మరో మూడేళ్ళలో రాష్ట్రంలో అద్భుతాలు జరగబోతున్నాయని కేసీఆర్ చెప్పుకోవడాన్ని ప్రతిపక్ష పార్టీలు ఎద్దేవా చేసాయి. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ అసలు బడ్జెట్ కేటాయింపులకు చేతిలో నిధులే లేకుండా ముఖ్యమంత్రి ఏవో అద్భుతాలు జరుగుతాయని కలలు కంటున్నట్లున్నారని వ్యంగంగా విమర్శించారు. కేంద్రం అనుమతి, ఆర్.బీ.ఐ. అనుమతీ లేకుండా రాష్ట్రానికి ఏవిధంగా అప్పు దొరుకుతుందని ప్రశ్నించినపుడు, కేసీఆర్ కూడా అది కష్టమేనని అంగీకరించారు. కానీ బ్యాంకుల నుండి అదనంగా అప్పులు తెచ్చుకొనేందుకు కేంద్రాన్ని అనుమతి కోరామని చెప్పారు. అంటే కేంద్రం అనుమతిస్తే తప్ప బడ్జెట్ లో పేర్కొన్న పనులు ముందుకు సాగవని స్పష్టం అవుతోంది. కానీ కేంద్రంతో నిత్యం ఘర్షణ వైఖరి అవలంభిస్తూ, దాని సహాయం ఆశించడం కూడా అవివేకమే అవుతుంది. కనుక కేసీఆర్ తన వైఖరి మార్చుకొని అందరినీ కలుపుకొని వెళ్లేందుకు ముందుకు వస్తే తాము కూడా ప్రభుత్వానికి అండగా ఉంటామని జానారెడ్డి హితవు పలికారు. ఈసారి సమావేశాలలో మాట్లాడిన ప్రతిపక్ష సభ్యులు అందరూ కూడా, వివిధ అంశాలపై మాట్లాడుతూ, కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని హితవు చెప్పడం గమనార్హం. మరి ఇప్పటికయినా ఆయన అందరితో సఖ్యతగా మెలగడం అలవరచుకొంటే, ప్రతిపక్షాలే కాదు ఇరుగు పొరుగు రాష్ట్రాలు, కేంద్రం నుండి కూడా తెలంగాణా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందుతాయి. అప్పుడు ఈ సమస్యలన్నిటి నుండి రాష్ట్రం, ప్రభుత్వం రెండూ కూడా బయటపడగలవు.