11 ప్రశ్నల పరిస్థితేంటి?

 

 

 

రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం రాష్ట్ర విభజనను ఒక చిన్నపిల్లల ఆటగా భావిస్తున్నట్టుంది. ఈ ప్రక్రియను ఏదో ఆషామషీగా నిర్వహిస్తూ విభజన వైపు దూసుకు వెళ్తోంది. మంత్రుల బృందం ఎప్పుడు సమావేశమైనా ఒకళ్ళో ఇద్దరో మంత్రులు సమావేశానికి డుమ్మా కొడుతున్నారు.

 

రాష్ట్ర విభజన అంశం కంటే వీళ్ళకి అంత కొంపలు మునిగిపోయే పనులు ఏమున్నాయో అర్థం కాని విషయం. సరే, ఆ విషయం అలా వుంచితే, రాష్ట్ర విభజనకు సంబంధించి మంత్రుల బృందం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు స్కూలు పిల్లలకు ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చినట్టుగా 11 ప్రశ్నలు ఇచ్చింది. వేలికి వేస్తే కాలికి వేసినట్టుగా, కాలికి వేస్తే వేలికి వేసినట్టుగా వుండే ఆ 11 ప్రశ్నలకు పార్టీలు సమాధానాలు ఇవ్వాలని మంత్రుల బృందం కోరింది. ఆ ప్రశ్నల్లో దేనికి సమాధానం ఇచ్చినా రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపినట్టు వుండేలా చాలా తెలివిగా ఆ ప్రశ్నలను రూపొందించింది. అయితే జీఓఎం ముందుకు వెళ్ళిన ఏ పార్టీ కూడా సదరు 11 ప్రశ్నలకు సరైన విధంగా సమాధానం ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే పార్టీలు ఎలాగూ సమాధానం ఇవ్వలేదు కాబట్టి సరిపెట్టుకోవచ్చు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కోరుకుంటున్న పార్టీలు కూడా ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు. అంతెందుకు.. రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నల ఫార్మాట్‌కి సమాధానాలు ఇచ్చినట్టు లేదు. ఈ విషయంలో మంత్రుల బృందం కూడా పెద్దగా పట్టింపు లేనట్టు కనిపిస్తోంది. తాను ఇచ్చిన క్వశ్చన్ పేపర్‌కి ఏయే పార్టీలు సరైన సమాధానాలిచ్చాయన్నది వెల్లడించడం లేదు. తాను ఇచ్చిన ప్రశ్నల సమాధానాల విషయంలో పట్టింపులేని జీఓఎం ఆ అమూల్యమైన 11 ప్రశ్నల్ని సంధించడమెందుకు.. జనాన్ని టెన్షన్ పెట్టడమెందుకు?