‘ఆపరేషన్ టైగర్’ సక్సెస్‌లో టెక్నాలజీదే కీ రోల్!
posted on: Feb 7, 2026 1:50PM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతలో సంచరిస్తూ.. గత 17 రోజుల పాటు జిల్లా వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసిన పెద్దపులిని అటవీశాఖ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ టైగర్ ద్వారా సక్సెస్ ఫుల్ గా బంధించిన సంగతి తెలిసిందే. శుక్రవారం (ఫిబ్రవరి 6) పెద్దపులిని బంధించిన అధికారులు ఆ పులిని విశాఖ జూపార్క్ కు చేర్చారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఆపరేషన్ టైగర్ లో అటవీ సిబ్బంది పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. మత్తు ప్రభావంతో స్ఫృహతప్పిన పులిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా బంధించి ప్రత్యేక బోనులో కట్టుదిట్టమైన భద్రత నడుమ విశాఖకు తరలించారు.
పులిని విశాఖపట్నంలోని ఎండాడ యానిమల్స్ రెస్క్యూ సెంటర్‌కు చేర్చారు. జూ క్యూరేటర్ మంగమ్మ, వెటర్నరీ డాక్టర్ భాను ప్రసాద్, అటవీశాఖ అధికారులు, పోలీసుల సమక్షంలో పెద్దపులి విశాఖ జూపార్క్‌కు చేరుకుంది. ప్రస్తుతం పులి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో రాజమండ్రి పరిసర ప్రాంతాలవారు ఊపిరి పీల్చుకున్నారు. కాగా 15 రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి ఈ పులి వలస వచ్చిందని, దాని వయసు మూడు నుంచి మూడున్నర సంవత్సరాల మధ్య ఉంటుందని సీసీఎఫ్ దివాన్ మహాయొద్దేన్ తెలిపారు. అదలా ఉంటే ఆపరేషన్ టైగర్ ను పటిష్టంగా నిర్వహించేందుకు పూణే నుంచి రాజమండ్రి వచ్చిన ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక నిపుణుల బృందం అత్యాధునిక సాంకేతికతను వినియోగించి పులిని సురక్షితంగా బంధిం చింది.
పులి కదలికలను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు.. కీలక ప్రాంతాల్లో పాతిక ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి వెళ్లే అవకాశమున్న దారులు, పశువులపై పులి దాడులు జరిపిన ప్రాంతాలు, నీటి వనరుల సమీపంలో ఈ కెమెరాలను అమర్చారు. వీటివల్ల పులి ఎక్కడ తిరుగుతుందో స్పష్టమైన సమాచారం లభించింది. పులి కదలికలను తక్షణమే గుర్తించేందుకు పది 4G కెమెరాలను వినియోగించారు. ఈ కెమెరాలను నేరుగా అధికారుల ఫోన్లకు అనుసంధానం చేశారు. దీంతో పులి కదలికలు నమోదైన వెంటనే సిబ్బందికి అలర్ట్ మెసెజ్ వచ్చింది. ఇది రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయడంలో కీలకంగా మారింది. రాత్రి వేళల్లోనూ పులి జాడను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్‌ను అటవీ శాఖ వినియోగించింది. ఈ డ్రోన్ ద్వారా పులి శరీర ఉష్ణోగ్రతను గుర్తించి, దాని కదలికలను ట్రాక్ చేసే ప్రయత్నం చేశారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. మత్తుమందు ఇచ్చిన తర్వాత పులిని బంధించేందుకు మూడు ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేశారు. ఈ బోన్ల వద్ద పీటీజెడ్ కెమెరాలు అమర్చారు. పులి బోన్ల సమీపానికి వచ్చిన వెంటనే అధికారులు వెంటనే చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి టెక్నాలజీ వినియోగం సక్సెస్ అవ్వడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులకు పెద్దపులి భయం తొలగిపోయింది.


.webp)



