Latest News

బెంగళూరు లైఫ్ స్టైల్‌పై టెక్కీ షాకింగ్ పోస్ట్!

posted on: Mar 10, 2026 6:27PM

 

మెట్రో నగరాల్లో జీవితం అవకాశాలతో నిండినదే. కానీ అదే సమయంలో అలసట, ఒత్తిడితో కూడుకున్నదిగా మారుతుంది. ముఖ్యంగా ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల దైనందిన జీవితం ఎంత ఒత్తిడిగా ఉంటుందో ఒక సీనియర్ టెక్కీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆఫీసులో కేవలం రెండు గంటల పాటు ప్రశాంతంగా పని చేయడానికి తాను రోజంతా ఎలా పోరాడాల్సి వస్తుందో ఆయన వివరించిన విధానం అనేక మంది ఐటీ ఉద్యోగులకు తమ జీవితాన్నే ప్రతిబింబిస్తున్నట్టు అనిపిస్తోంది.

ఆ టెక్కీ చెప్పిన వివరాల ప్రకారం ఆయన రోజు ఉదయం 7:30 గంటలకు వేడి వేడి ఫిల్టర్ కాఫీతో మొదలవుతుంది. ఆ కాఫీ ఇచ్చే ఉత్సాహంతోనే వెంటనే ఆఫీస్ మెసేజ్‌లు, వర్క్ అప్‌డేట్స్ చెక్ చేయడం ఆయనకు నిత్యకృత్యంగా మారిపోయింది. ఉదయం 8:30 గంటలకల్లా ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఆలస్యమైనా బెంగళూరులోని భారీ ట్రాఫిక్‌లో గంటల పాటు చిక్కుకుపోవాల్సిన పరిస్థితి.

ఉదయం 9:30 గంటలకు టీమ్ స్టాండప్ మీటింగ్‌తో అధికారికంగా పని ప్రారంభమవుతుంది. అయితే ఆ మీటింగ్‌లో జరిగే చర్చలు ఎక్కువగా ఇతర టీమ్స్ నుంచి రావాల్సిన ‘డిపెండెన్సీ’ల చుట్టూనే తిరుగుతాయని ఆయన సరదాగా పేర్కొన్నారు. అసలు పని మీద ఏకాగ్రత సాధించాలంటే ఉదయం 11 గంటల వరకు వేచి చూడాల్సి వస్తుందని ఆయన చెబుతున్నారు. అప్పటికీ వందలాది వాట్సాప్ గ్రూపుల నోటిఫికేషన్లు మ్యూట్ చేయకపోతే ప్రశాంతంగా పని చేయడం కష్టమని తెలిపారు.

మధ్యాహ్నం 1 గంటకు లంచ్ బ్రేక్ వచ్చినా, టీమ్‌తో కలిసి బయటకు వెళ్లి ఏం తినాలనే చర్చకే చాలా సమయం గడిచిపోతుందని ఆయన చెప్పారు. సాయంత్రం 3 గంటల నుంచి వరుసగా జరిగే మీటింగ్‌లు, కాల్స్ అసలు ప్రొడక్టివిటీని దెబ్బతీస్తాయని, నిజానికి వాటిలో చాలా విషయాలు ఒక చిన్న ఈమెయిల్ లేదా డాక్యుమెంట్‌తోనే ముగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.సాయంత్రం 6 గంటల సమయంలో కొద్దిసేపైనా ఒత్తిడిని తగ్గించుకోవడానికి జిమ్‌కు వెళ్లడం లేదా నడక చేయడం ఆయన అలవాటు. రాత్రి 8:30 గంటల సమయంలో డిన్నర్ ప్లాన్ చేయడం కూడా మరో సమస్యగా మారుతుందని, ఫుడ్ డెలివరీ యాప్‌లలో ఏం ఆర్డర్ చేయాలా అనే సందిగ్ధంతోనే కొంత సమయం గడిచిపోతుందని తెలిపారు.

చివరకు రాత్రి 11:30 గంటల సమయంలో మరోసారి కోడ్ రివ్యూ చేసి, ఏదైనా అత్యవసర పని వస్తుందేమో అనే ఆలోచనతో లాప్‌టాప్‌ను పక్కనే పెట్టుకుని నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వేదన వ్యక్తం చేశారు. ఈ అనుభవాన్ని వివరించిన ఆ టెక్కీ చివరగా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. బెంగళూరు నగరం మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఏమిటంటే, రోజులో కనీసం రెండు గంటలైనా పూర్తి ఏకాగ్రతతో పని చేయకపోతే ఆ సమయాన్ని ట్రాఫిక్‌, అనవసరమైన మీటింగ్‌లు తినేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్ట్ చదివిన అనేక మంది ఐటీ ఉద్యోగులు “ఇది మా కథే” అంటూ స్పందిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...