టెక్ శంకర్ సహా ఏడుగురు మావోయిస్టులు హతం
posted on Nov 19, 2025 11:03AM

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. మంగళవారం ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించగా మిగిలిన వారు అడవుల్లో దాక్కుని ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలు చేపట్టిన సంయుక్త కూంబింగ్ లో గుత్తులూరు హిల్ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి పోలీసులపై కాల్పులు జరిపారనీ, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారనీ లడ్డా వివరించారు. మృతులలో మావోయిస్టుల ఐఈడీ నిపుణుడు మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారన్నారు.
మావోయిస్టు టెక్ శంకర్ పేలుడు పరికరాల తయారీలో కీలక పాత్ర పోషించిచాడనీ, గత కొన్నేళ్లుగా మావోయిస్టులు అమర్చిన అనేక లాండ్ మైన్ లరూపకల్పనలో కూడా టెక్ శంకర్ దే కీలక పాత్ర అని లడ్డా చెప్పారు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మిగతా సభ్యులను జ్యోతి అలియాస్ సరిత, సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, సైను అలియాస్ వాసు, అనిత, షమ్మిలుగా గుర్తించారు.