3 రోజుల సెలవు పెట్టానని ఉద్యోగం తీసేశారు.. ఐటీ ఉద్యోగి ఆవేదన..!

posted on: Jul 23, 2026 5:30PM

 

టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. !

దుండిగల్ పీఎస్‌లో ఫిర్యాదు..!

హైదరాబాద్ ఐటీ రంగాన్ని ఒకవైపు మెరుపులు, మరోవైపు మానవత్వం లేని కార్పొరేట్ వైఖరి ఎల్లప్పుడూ చర్చనీయాంశం చేస్తూనే ఉంటాయి. ఐటీ కారిడార్‌లో లక్షల మంది యువతీ యువకులు రాత్రింబగళ్లు కష్టపడుతూ తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంటే, చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా కార్పొరేట్ కంపెనీలు వారిని ఏవిధంగా రోడ్డున పడేస్తాయో తెలిపే ఒక సంచలన సంఘటన తాజాగా మేడ్చల్ పరిధిలోని టెక్ మహీంద్రా వద్ద వెలుగుచూసింది. వందలాది మంది పోటీ పడిన ఇంటర్వ్యూలో తన ప్రతిభతో నెగ్గి, ఎంతో ఆశతో టెక్ మహీంద్రా సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేరిన భావన అనే ఐటీ ఉద్యోగినికి ఎదురైన అనుభవం ఇప్పుడు సగటు ఉద్యోగి గుండెలను పిండేస్తోంది.

కథనం వివరాల్లోకి వెళితే, జూన్ నెలలో విధి నిర్వహణలో ఉండగానే భావనకు తీవ్రమైన అనారోగ్యం చేసింది. కంపెనీ ఫ్లోర్‌పైనే ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే తోటి ఉద్యోగులు, యాజమాన్యం ఆమెను యూనివర్సిటీ ఆవరణలోని ఒక చిన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు భావన పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం వెంటనే మల్లా రెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి ప్రాథమిక చికిత్స అనంతరం, సరైన సౌకర్యాలు లేవనే ఉద్దేశంతో ఆమె భర్త భావనను తమ ఇంటికి సమీపంలో ఉన్న ఆస్పత్రికి మార్చారు. సుదీర్ఘకాలం పాటు కార్పొరేట్ కంపెనీల్లో గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల ఆమె తీవ్రమైన స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు.

స్పాండిలైటిస్ వ్యాధి నయం కావడానికి వైద్యుల సూచన మేరకు ఆమె 15 రోజుల పాటు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన సమగ్ర వైద్య పత్రాలు, డాక్టర్ సర్టిఫికెట్లను టెక్ మహీంద్రా యాజమాన్యానికి భావన వెంటనే సమర్పించారు. అయితే, ఆ 14 రోజుల చికిత్స సమయంలో కంపెనీ నుంచి వచ్చిన స్పందన ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. కనీసం మానవత్వంతో 'మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏమైంది?' అని పరామర్శించాల్సింది పోయి, 'ఎప్పుడు ఆఫీస్‌కు రిపోర్ట్ చేస్తారు? ఎప్పుడు వస్తున్నారు?' అంటూ కంపెనీ అధికారులు భావనకు నిరంతరం బెదిరింపు ఈ-మెయిళ్లు, ఫోన్ కాల్స్ చేస్తూ తీవ్ర ఒత్తిడికి గురిచేశారు.

అనారోగ్యం నుంచి తేరుకుంటున్న సమయంలో భావన చిన్న పాప తీవ్ర అనారోగ్యానికి గురైంది. తన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి రావడంతో, శుక్రవారం రోజున కంపెనీ అధికారులకు కాల్ చేసి విషయం స్పష్టంగా వివరించి 3 రోజుల సెలవు కోరారు. శనివారం పాపను ఆస్పత్రిలో చేర్పించి, ఆ వివరాలకు సంబంధించిన ఆధారాలను కూడా కంపెనీకి పంపించారు. కానీ, టెక్ మహీంద్రా యాజమాన్యం మాత్రం భావన ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కమ్యూనికేషన్ లేక ఆఫీస్‌కు రావడం లేదనే నెపంతో అకారణంగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు (టర్మినేషన్) ఒక షాకింగ్ మెయిల్ పంపింది. ఎంతో నిబద్ధతతో పనిచేసిన తనను పారిపోయినట్లు చిత్రించి ఉద్యోగం నుంచి తీసివేయడం ఆమెను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

జూలై 22వ తేదీన ఈ విషయమై మాట్లాడేందుకు భావన ఆఫీస్‌కు వెళ్లినప్పటికీ, అక్కడ ఎదురైన భయాందోళనకర వాతావరణం, యాజమాన్యం అనుసరించిన కఠిన వైఖరితో ఆమె నేరుగా దుండిగల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెకు రసీదు అందించారు. హఠాత్తుగా ఉద్యోగం తీసేస్తే తమ కుటుంబం పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ, మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు భావన ధర్నాకు దిగారు. ఏ ఆధారాలూ లేకుండా, కావాలని తనను వేధించి ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులందరినీ టర్మినేట్ చేసేదాకా తాను వెనక్కి తగ్గేది లేదని, ఇక్కడే కూర్చుని పోరాడతానని భావన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తోంది.

Tech Mahindra employee Bhavana, Software employee protest Medchal, Tech Mahindra layoff controversy, Dundigal police station IT complaint, Hyderabad software engineer news, Tech Mahindra Bhavana termination

google-ad-img
    Related Sigment News
    • Loading...