Latest News
బీసీసీఐ వరల్డ్ కప్ ప్రణాళిక.. విన్ తో రోకోకు ఘనవీడ్కోలే లక్ష్యం!
posted on: Mar 10, 2026 1:53PM
.webp)
ఇప్పటికే టెస్ట్, టి20 ఫార్మట్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ఆ వన్డేలకు కూడా 2027 వరల్డ్ కప్ తరువాత రిటైర్మెంట్ ప్రకటించడం లాంఛనమే అన్నది క్రీడాపండితుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో రోకో (రోహిత్ శర్మ, కోహ్లీ)లకు ఘన వీడ్కోలు ఇచ్చేందుకు బీసీసీఐ ప్రణాళికాబద్ధంగా షెడ్యూల్ రూపొందింది. 2027 వన్డే వరల్డ్ కప్ విజయాన్ని వారికి వీడ్కోలు బహుమానంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో రూపొందించినట్లుగా ఈ షెడ్యూల్ ఉంది.
దీంతో వచ్చే వరల్డ్ కప్ లోగా టీమ్ ఇండియా కనీసం 20 వన్డే మ్యాచ్ లు ఆడుతుంది. వీటిలో ఈ ఏడాది అంటే 2026లో ఆప్ఘనిస్థాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంకలతో మూడేసి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఉండగా వచ్చే ఏడాది ఆసియా కప్ లో భాగంగా కనీసం ఐదు వన్డేలు ఉన్నాయి. ఈ షెడ్యూల్ ప్రకారం చూస్తే రోకో ఫామ్ ను దృష్టిలో ఉంచుకునే బీసీసీఐ ఈ షెడ్యూల్ రూపొందించిందని అవగతమౌతుంది.
ఇంకో విశేషం ఏమిటంటే.. వీటిలో న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను మినహాయిస్తే.. మిగిలిన సిరీస్ లన్నీ ఇండియా వేదికగా జరుగుతాయి. ఇక ఆసియాకప్ మ్యాచ్ లైతే బంగ్లాదేశ్ లేదా తటస్థ వేదికపై జరుగుతాయి. ఇక రోకో విషయానికి వస్తే 2027 వన్డే వరల్డ్ కప్ విజయమే తమ లక్ష్యం అని ఇరువురూ పలు సందర్బాలలో చెప్పారు. అయితే చీఫ్ కోచ్ ప్రణాళికలు ఎలా ఉన్నాయన్నది అర్ధం కావడం లేదు.
ప్లేయర్లు ఎవరన్నది కాదు. విజయమే ముఖ్యం అని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ వస్తున్న గంభీర్ కు కోహ్లీ రోహిత్ లతో ఉన్న విభేదాలు తెలియంది కాదు. అయితే బీసీసీఐ మాత్రం వన్డే వరల్డ్ కప్ లో రోకో ఆడాలని భావిస్తే మాత్రం వారికి అవకాశం ఇచ్చి తీరాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా బిజీ షెడ్యూల్ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.






