ఇషాన్ కిషన్ పరుగుల తుపాన్.. పాకిస్థాన్ పరేషాన్

posted on: Feb 15, 2026 9:49PM

టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లో దాదాది జట్టును చిత్తు చేసిన టీమ్ ఇండియా

టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా పాకిస్థాన్ పై సునాయాస విజయం సాధించింది. ఏకంగా 61 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్ ను చిత్తు చేసింది.  కొలంబోలోని  ప్రేమదాస స్టేడియంలో   జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో   విజయంతో సూపర్ 8 దశకు దూసుకెళ్లింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత టాస్ కోల్పోయి బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా ఆరంభంలోనే అభిషేక్ వర్మ వికెట్ కోల్పోయింది. అభిషేక్ వర్మ డకౌట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ ఇషాంత్ కిషన్ పాక్ బౌలర్లను ఓ ఆటాడుకుని పరుగుల తుపాన్ సృష్టించాడు. ఇషాన్ కేవలం 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. తిలక్ వర్మ పాతిక పరుగులు, స్కిప్పర్ సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులతో రాణించారు. చివరిలో శివమ్ దుబె 17 బంతులలో 27 పరుగులు, రింకూసింగ్ 4 బంతుల్లో 11 పరుగులతో బ్యాట్ ఝుళిపించడంతో టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది.

176 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయ్యింది. హార్థిక్ పాండ్యా, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభం నుంచే చేతులెత్తేసింది.  హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే వికెట్లు తీసి పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. ఒక దశలో 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ బ్యాటర్లలో  ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో రాణించాడు. మిగిలిన పాక్ బ్యాటర్లంతా పెవిలియన్ కు క్యూ కట్టారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...