టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా శుభారంభం
posted on: Feb 8, 2026 8:14AM
.webp)
టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. శనివారం అమెరికా జట్టుతో ఆడిన తొలి మ్యాచ్ లో 29 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించి టి20 వరల్డ్ కప్ లో విజయాల బోణి కొట్టింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాను అమెరికా బౌలర్లు బెంబేలెత్తించారు. అభిషేక్ వర్మ, ఇషాంత్ కిషన్, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యాలు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. 13 ఓవర్లకు టీమ్ ఇండియా కేవలం 77 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అయితే స్కిప్పర్ సూర్య ఒక ఎండ్ లో పాతుకు పోయి టీమ్ ఇండియా గౌరవ ప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 84 పరుగులు చేశాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ ఇండియా 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. 162 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టి రాణించారు.
ఈ గెలుపుతో టీమిండియా టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా తొమ్మిది విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. అలాగే మొత్తంగ వరల్డ్ కప్ లో అంటే టి20, వన్డేలు కలిపి జట్టు విజయాల సంఖ్య 100కు చేరింది. ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. 108 విజయాలతో ఆస్ట్రేలియా జట్టు తొలి స్థానంలో ఉంది.






