మోడీ గారికి ఏపీ ప్రజల లేఖ
posted on May 10, 2015 4:12PM

భారత ప్రధాని నరేంద్రమోడీకి బాగా విసిగిపోయి వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాసుకుంటున్న లేఖ. ఏపీ ప్రజలు రాసిన లేఖ అనగానే ఏ ప్రత్యేక హోదా కోసమో రాసిన లేఖ అనో, కష్టాల్లో వున్నాం ఆర్థికంగా ఆదుకోండి మహాప్రభో అని మొరపెట్టుకునే లేఖో అనుకున్ని ఎప్పట్లాగే చెత్తబుట్టలో విసిరేయకండి. ఇది అలాంటి లేఖ కాదు.. మీకు అలాంటి లేఖలు ఎన్ని రాసినా ఉపయోగం వుండదని మాకు అర్థమైపోయింది. కాబట్టి మీకు అలాంటి లేఖలు రాయబోం. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అర్జెంటుగా మీ పార్టీలో విలీనం చేసుకోండని విజ్ఞప్తి చేసే లేఖ.
పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయి వున్న వైసీపీ నాయకుడు జగన్ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ పంచన వున్నారు. ఇప్పుడు మీ పంచన చేరాలని తహతహలాడుతున్నాడు. ఆయన పార్టీని మీ పార్టీలో విలీనం చేసేసి తన కేసుల నుంచి పూర్తిగా తప్పించుకునే ప్లాన్‌లో వున్నాడు. బీజేపీ నాయకుడిగా మారిపోయి ఏపీలో హడావిడి చేసి, టీడీపీకి, బీజేపీకి మధ్య చిచ్చు పెట్టి తాను లాభం పొందాలని అనుకుంటున్నాడు. ఆయన మొన్నటి వరకు టీడీపీ - బీజేపీ ఫ్రెండ్ షిప్ ఎప్పుడు కట్టయిపోతుందా, నా పార్టీ టీడీపీ ప్లేసులోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. అందుకు తెరవెనుక ప్రయత్నాలు కూడా చేశారు. అయితే అది వర్కవుట్ కాలేదు. అందుకే ఇప్పుడు పార్టీని విలీనం చేస్తే ఓ పనైపోతుందని భావిస్తున్నారు. సొంత పార్టీ ద్వారా ఎలాగూ సీఎం కాలేకపోయాను... బీజేపీలో చేరితే అయినా సీఎం అయిపోతానని కలలు కంటున్నారు. మీ పార్టీ కూడా ఏపీలో పాతుకుపోవాలని, వచ్చే ఎన్నికలలో అధికారం సంపాదించాలని కలలుకంటోంది. మీ రెండు పార్టీల మనసులలో కలసిపోవాలని కలలున్నప్పటికీ, ఆ కలలకు టీడీపీకి - బీజేపీకి మధ్య వున్న దోస్తీ అడ్డం వస్తోంది. అయితే టీడీపీ - బీజేపీ దోస్తీ వల్ల ఏపీకి ఎలాంటి లాభం లేదని అందరికీ అర్థమైపోయింది. అంచేత ఈ ముసుగులో గుద్దులాటలు మానేసి వైసీపీని మీ పార్టీలో కలిపేసుకోండి. అప్పుడు ఆటోమేటిగ్గా టీడీపీతో మీ దోస్తీ కట్ అయిపోతుంది. ఇప్పటి వరకూ మీతో మిత్రధర్మం పాటిస్తూ వస్తున్న టీడీపీ అప్పటి నుంచయినా యాక్టివ్ అయిపోయి ఏపీ హక్కుల సాధనలో కేంద్రంతో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించగలుగుతుంది. అంచేత అందరికీ ఆనందాన్నిచ్చే బీజేపీలో వైసీపీ విలీనం సాధ్యమైనంత త్వరగా జరిగిపోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. తమరు ఈ విషయాన్ని పరిశీలించల్సిందిగా విజ్ఞప్తి.