మీ అబ్బను చంపినట్లే నిన్నూ చంపేస్తాం..టీడీపీ నేతకు బెదిరింపు లేఖ

posted on: Jun 5, 2026 9:33PM

 

కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగు దేశం పార్టీ మాజీ ఇన్‌చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు లేఖ పంపారు. "మీ తండ్రి పెద్ద వీరారెడ్డిని చంపినట్లే నిన్నూ చంపేస్తాం.. మీ ఇంట్లోనే హత్య చేస్తాం" అంటూ నాలుగు పేజీల లేఖను స్పీడ్ పోస్టు ద్వారా పంపినట్లు సమాచారం. తప్పుడు చిరునామాతో ఈ లేఖను ఆయన ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీకి, అలాగే టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

"ఇలాంటి బెదిరింపులకు భయపడను" : ప్రవీణ్ కుమార్ రెడ్డి

ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లేఖ రాసిన వ్యక్తి నీచుడని, గుంటనక్కలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన తండ్రి పెద్ద వీరారెడ్డి ప్రజల కోసం పోరాడుతూ రౌడీయిజాన్ని అణచివేసినందుకే హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. 

తమ కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమని, వీరశివారెడ్డి, లక్ష్మీదేవమ్మ, తాను ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రతినిధులుగా పనిచేశామని తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాకుండా నేరుగా ఎదురుగా రావాలని సవాల్ విసిరారు. ఈ బెదిరింపు లేఖ వెనుక ఉన్నవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...