పవన్ కళ్యాణ్‌కి టీడీపీ గిఫ్ట్
posted on Apr 11, 2014 2:40PM

ఈ ఎన్నికలలో బీజేపీకి, టీడీపికి మద్దతు ప్రకటించిన సినీ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్‌కి తెలుగుదేశం పార్టీ సీట్ల రూపంలో థాంక్స్ చెబుతోంది. అసెంబ్లీ టిక్కెట్లలో కొన్నింటికి పవన్ కళ్యాణ్ సూచించిన అభ్యర్థులకు కేటాయించేలా లోపాయికారీ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ టిక్కెట్లలో కొన్నింటిని ‘పవన్ కళ్యాణ్ కోటా’ కింద ప్రత్యేకంగా ఉంచినట్టు సమాచారం.
ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్సీ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎంపికైన మేడిపల్లి సత్యం పవన్ కళ్యాణ్ అనుయాయుడు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పనిచేశాడు. ఏరకంగా చూసినా మేడిపల్లి సత్యానికి చొప్పదండి సీటు ఇవ్వడానికి అవకాశాలు లేవు. సత్యాన్ని మించిన నాయకులు ఆ నియోజకవర్గంలో చాలామంది వున్నారు. మేడిపల్లి సత్యం పవన్ కళ్యాణ్ ‘కోటా’లో వ్యక్తి కావడం వల్లే ఆయనకి సీటు వచ్చిందని తెలుస్తోంది.
ఇదిలా వుంటే తెలంగాణ సీట్లలో తన కోటా మీద పెద్దగా ఆలోచించని పవన్ కళ్యాణ్ సీమాంధ్రలో మాత్రం తన మనుషులకు కనీసం ఐదు నుంచి పది సీట్లయినా ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. పవన్ కోరిక కూడా సమంజసంగానే వుండటంతో సీమాంధ్రలో పవన్ కోటాకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. త్వరలో ప్రకటించబోయే సీమాంధ్ర అసెంబ్లీ అభ్యర్థులలో పవన్ సూచించిన అభ్యర్థులకు ఛాన్స్ బాగా దొరికే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.