స్థానిక పీఠాల్లో కూటమి పాగా!
posted on Apr 28, 2025 2:40PM

ఫలిస్తున్న బాబు చాణక్యం
దూసుకు పోతున్న కూటమి
డీలా పడిన వైసీపీ
ఏపీలో కూటమి పార్టీలు స్థానిక పీఠాలను కైవశం చేసుకుంటున్నాయి. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలల రాజధాని నిర్మాణం ఓ వైపు యుద్ధప్రాతిపదికన సాగుంతోంది. మూడేళ్ల కాల వ్యవధిలో అమరావతి పూర్తి కానున్నదని చంద్రబాబు నమ్మకంగా చెబుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పనుల వేగం ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నది, అదే సమయంలో తెలుగుదేశం స్థానిక సంస్థలపై దృష్టి కేంద్రీకరించింది. జగన్ హయాంలో దౌర్జన్యంగా గెలుచుకున్న స్థానిక సంస్థలలో జెండా ఎగుర వేస్తున్నది. గ్రేటర్ విశాఖపై కన్నేసిన టీడీపీ ఆ దిశగా దూసుకెళ్లి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం లో సక్సెస్ అయింది.
ఇక అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ దక్కించుకున్న గుంటూరు,కుప్పం, మాచర్ల మున్సిపల్ పీఠాల్నిసైతం తెలుగుదేశం కూటమి తన ఖాతాలో వేసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయా స్ధానాల్లో ఉన్న మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు తప్పుకోవడమో, అవిశ్వాసంలో పదవులు కోల్పోవడమూ జరుగుతోంది. ఈ సీట్లను ఎన్నికల ద్వారా కూటమి సర్కార్ తమ ఖాతాలో జమ చేసుకుంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో పలువురు వైసీపీ సభ్యులు టీడీపీ వైపు దూకేశారు. దీంతో ఐదో వార్డ్ కౌన్సిలర్ సెల్వరాజ్ కూటమి తరఫున మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. వైసీపీ నుండి నలుగురు కౌన్సిలర్లు టీడీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో 24 మంది సభ్యులలో 14మంది మద్దతుతో పాటు ఎక్స్ ఆఫిషియో మెంబర్ మద్దతు కూడా లభించడంతో టీడీపీ సునాయాసంగా ఛైర్మన్ పీఠం దక్కించుకుంది
లాగే గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ పీఠం సైతం కూటమి కైవసం చుసుకుంది. మేయర్ ఎన్నికల్లో కూటమికి 34 ఓట్లు, వైసీకి 27 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ కౌన్సిలర్ కోవెలమూడి రవీంద్ర మేయర్ గా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఈ పరిణామంతో టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. గతంలో మేయర్ గా ఉన్న కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో ఇక్కడ మేయర్ ఎన్నిక జరిగింది.
మరోవైపు పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లోనూ కూటమి ఘన విజయం సాధించింది. మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉండగా.. ఇందులో 21 మంది కౌన్సిలర్ల మద్దతుతో టీడీపీ చైర్మన్ పీఠం దక్కించుకుంది. టిడిపి బలపరిచిన అభ్యర్థి 27 వార్డు కౌన్సిలర్ షేక్ మదార్ సాహెబ్ ఛైర్మన్ పీఠం అధిష్టించబోతున్నారు. గతంలో మాచర్లలో ఏకపక్షంగా ఛైర్మన్ పీఠం దక్కించుకున్న వైసీపీకి ఇది గట్టి ఎదురుదెబ్బగా భావించాల్సి ఉంటుంది. ఇక విజయవాడ మేయర్ పీఠంపై కూడా కూటమి కన్నేసిందని తెలుస్తోంది. విజయవాడలో టీడీపీ కూటమి అభ్యర్థి విజయానికి ఏ వ్యూహారు రచించనుననారన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న అంశంగా మారిపోయింది.