అవనిగడ్డలో టీడీపీకి సవాల్‌గా మారిన రెబల్!
posted on Apr 22, 2014 1:25PM
.jpg)
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, సీమాంధ్రలో ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తే టీడీపీ ఓడిపోయే మొట్టమొదటి సీటు కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ స్థానమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలహీనమైన అభ్యర్థులు వున్నారు. చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం తరఫున బలహీనమైన అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌ని ఈ స్థానం నుంచి నిలబెట్టారు. అయితే ఎంతోకాలంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూ, స్థానికంగా ప్రజల్లో మంచి పేరు వున్న కంఠంనేని రవిశంకర్ తనకు తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ స్థానం నుంచి టిక్కెట్ ఇస్తుందని ఆశించారు. ఈ మేరకు పార్టీ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మండలి బుద్ధ ప్రసాద్ తెలుగుదేశంలోకి జంప్ జిలానీ కావడంతో కొత్త ఒక వింత అన్నట్టు చంద్రబాబు స్థానికంగా ఎంతో బలం వున్న కంఠంనేని రవిశంకర్‌ని కాదని బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ఇచ్చారు. దాంతో కంఠంనేని తెలుగుదేశం తిరుగుబాటు అభ్యర్థిగా అవనిగడ్డ స్థానం నుంచి పోటీలో నిలిచారు. ఆయన నామినేషన్ వేసిన రోజున ఆయనతోపాటు వచ్చిన మద్దతుదారులను చూసి తెలుగుదేశం వర్గాలు నోళ్ళు తెరిచాయి. ఇంత బలం వున్న వ్యక్తిని మనం దూరం చేసుకున్నామే అన్న బాధ తెలుగుదేశం వర్గాల్లో మొదలైంది.
అవనిగడ్డ నియోజకవర్గం ప్రజలకు మండలి బుద్ధ ప్రసాద్ మీద నమ్మకం లేదు. ఆయనను గెలిపిస్తే ఏదో పదవిలో ఫిక్సయిపోయి నియోజకవర్గం ముఖమే చూడడన్న అభిప్రాయం ఇక్కడి ప్రజల్లోవుంది. అందుకే గత ఎన్నికలలో ఆయనను ఓడించారు. గెలిచినా నియోజకవర్గం ముఖం చూడను.. ఓడినా నియోజకవర్గం ముఖం చూడను అని ఆయన ఆ తర్వాత నిరూపించారు. మొత్తమ్మీద ఈ నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మండలి బుద్ధ ప్రసాద్, కాంగ్రెస్ తరఫున పోటీలో వున్న మత్తి వెంకటేశ్వరరావు, వైసీపీ తరఫున పోటీ చేస్తున్న సింహాద్రి రమేష్‌బాబు కంటే టీడీపీ రెబల్‌గా రంగంలో వున్న కంఠంనేని రవిశంకర్ బలమైన అభ్యర్థిగా నిలిచారు. అవనిగడ్డలో నిలిచిన అభ్యర్థులందరినీ పరిశీలిస్తే కంఠంనేని రవిశంకర్‌కే విజయావకాశాలు ఎక్కువగా వున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.