తెలంగాణా దొరలను బీసీలు ఎదుర్కోగలరా?

posted on: May 29, 2014 9:48AM

 

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత కొన్ని నెలలుగా ‘సామాజిక తెలంగాణ’ ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడమే కాకుండా, వారి ప్రతినిధి ఆర్. కృష్ణయ్యను పార్టీలో చేర్చుకొని తెలంగాణాకు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారు. నిన్న జరిగిన మహానాడు సమావేశంలో కూడా చంద్రబాబు మళ్ళీ ‘సామాజిక తెలంగాణ’ ఏర్పాటు గురించి మాట్లాడారు. కేసీఆర్ ధాటికి తట్టుకొని తెలంగాణాలో నిలబడాలంటే, అందుకు ఇదే దివ్యాస్త్రమని చంద్రబాబు భావిస్తున్నట్లున్నారు. అందుకే బీసీ వర్గానికి ఎల్.రమణను తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించబోతున్నారు. ఆయన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా అయినందున అపారమయిన రాజకీయ అనుభవము కూడా ఉంది. ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, కేసీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ఆయన విషయంలో చాలా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది. లేకుంటే బీసీల మీద దొరల అహంకారం ప్రదర్శిస్తున్నరని విమర్శలు ఎదుర్కోక తప్పదు.

 

ఇంతవరకు చంద్రబాబు అమలుచేసిన ఇటువంటి అనేక వ్యూహాలు దీర్గాకాలంలో మంచి ఫలితాలు ఇచ్చాయి. కనుక బహుశః వచ్చే ఎన్నికల నాటికి, ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేక, చంద్రబాబుతో పోటీపడి తెలంగాణాను అభివృద్ధి చేయలేక చతికిలపడినట్లయితే, బీసీల నేతృత్వంలో తెదేపా తెలంగాణాలో కూడా బలపడుతుందని చంద్రబాబు ఆలోచన కావచ్చును.

 

అయితే గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్న తెలంగాణా తెదేపా సీనియర్ నేతలు, ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవిని కూడా వదులుకొనేందుకు అంగీకరిస్తారా? అనే అనుమానాలున్నాయి. కానీ చంద్రబాబు ఎన్నికల సమయంలో తామందరినీ కాదని, పార్టీలోకి కొత్తగా తీసుకువచ్చిన ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినపుడు వారెవరూ వ్యతిరేఖించలేదు. కనుక ఇప్పుడు కూడా యల్. రమణకు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెడితే వ్యతిరేఖించకపోవచ్చును. నిన్న మహానాడులో మాట్లాడిన తెలంగాణా నేతలందరూ పోటీలుపడి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయడం చూస్తే వారు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేఖించకపోవచ్చనిపిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...