రసవత్తరం.. పశ్చిమ జడ్పీ పీఠం

 

పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ పీఠం కోసం తెలుగుదేశం పార్టీలో పోటీ రసవత్తరంగా మారింది. ఈ ప్రాంతంలో సైకిల్ జోరు బాగుండటంతో.. నాయకుల వలసలు కూడా ఎక్కువయ్యాయి. మొన్నటివరకు మూడు రంగుల కండువా కప్పుకొన్న తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో అక్కడి టికెట్ ఆశించిన గూడెం మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి బాపిరాజును జడ్పీ చైర్మన్ గా బరిలోకి దించుతారని ప్రచారం జరిగింది. దీంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు ఈ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ సీటు వేరేవారికి ఇస్తున్న నేపథ్యంలో తనకు జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే, ఆయన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పార్టీ వెనుకడుగు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ కూడా ఈ పదవి తనకే కావాలని గట్టిగా పట్టుపడుతుండటం, డీసీసీబీ ఎన్నికల సమయంలో టీడీపీలోకి వచ్చిన అల్లూరి విక్రమాదిత్య కూడా కుర్చీ కోసం సర్వశక్తులూ ఒడ్డుతుండటం ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురూ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరిని కాదన్నా మిగిలిన ఇద్దరూ ఒప్పుకునే పరిస్థితి కనిపించటం లేదు. రెండు రోజుల్లో దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu