బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్న తెదేపా

 

తెలుగుదేశం పార్టీ నేతల విసుర్లు చూస్తుంటే ఆ పార్టీ బీజేపీతో ఎన్నికల పొత్తులపై పునరాలోచనలోపడినట్లే కనిపిస్తోంది. మొన్న తెదేపా సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ని తీవ్రంగా విమర్శిస్తే, ఈరోజు యనమల రామకృష్ణుడు బీజేపీని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో ప్యాకేజి కుదుర్చుకొన్నందునే బీజేపీ విభజన బిల్లుకి మద్దతు ఇచ్చిందని విమర్శించారు. రెండు పార్టీలు పక్షపాత వైఖరితో వ్యవహరించి సీమాంద్రులకు తీరని అన్యాయం చేసి, మళ్ళీ వారినేదో ఉద్దరిస్తున్నట్లుగా ప్యాకేజీలు మేమిప్పించామంటే మేమే ఇప్పించామని గొప్పలు చెప్పుకొంటున్నాయని విమర్శించారు. అయితే ఇంతవరకు చంద్రబాబు బీజేపీ గురించి మాట్లాడలేదు. శంఖంలో పోస్తే కానీ నీరు తీర్ధం కాదన్నట్లుగా శాస్త్రప్రకారం ముందుగా తన నేతలతో ఈ తెగతెంపుల కార్యక్రమం మొదలుపెడితే, బీజేపీ కూడా ఏ నాగం జనార్ధన్ రెడ్డి ద్వారానో చంద్రబాబుని ఓ నాలుగు ముక్కలు తిట్టించకపోదు. అప్పుడు చంద్రబాబు రంగంలో దిగి పొత్తులు గురించి మేమెన్నడూ ఆలోచించనేలేదని ముక్తయిస్తారేమో!

 

ఒకవేళ ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోకపోయినట్లయితే రెండు పార్టీలు ఎంతో కొంత మేర నష్టపోవచ్చును. బీజేపీ సీమాంధ్రలో నష్టపోతే, తెదేపా తెలంగాణాలో పోవచ్చును. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తమ వల్లనే సాధ్యమయిందని ప్రచారం చేసుకొంటున్న కాంగ్రెస్ పార్టీతో పోటీపడుతూ బీజేపీ కూడా తెలంగాణా ఏర్పాటు తమ సహకారం వలననే సాధ్యపడిందని మొదలుపెట్టిన ప్రచారం, తెదేపా ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనే అవకాశాలను క్రమేపి తగ్గించి వేస్తోంది. బహుశః మరొకమూడు నాలుగు రోజుల్లో ఆ రెండు పార్టీల నేతలు తమ మధ్య పొత్తుల ఆలోచనలేవీ లేవని ప్రకటిస్తారేమో. ఆ తంతు కూడా ముగిస్తే ఇక ఆ రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి నిప్పులు చెరుగుకోవడం మొదలు పెడతాయేమో!