టీసీఎస్ ఉద్యోగి అమిత్ బ్రహ్మే ఆత్మహత్య.. ఇద్దరు మహిళా ఉద్యోగులపై కేసు

posted on: Jun 13, 2026 10:09AM

పుణెలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో పని చేస్తున్న 48 ఏళ్ల అమిత్ అభయ్ బ్రహ్మే  ఆత్మహత్య కు సంబంధించి ఇద్దరు మహిళా ఉద్యోగులపై కేసు  నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.  అమిత్ అభయ్ బ్రహ్మే  ఈ నెల2న భోసరిలోని తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతడి    ఆత్మహత్య  కార్పొరేట్ ప్రపంచంలో దాగున్న మానసిక వేధింపుల చీకటి కోణాన్ని మరోసారి బయటపెట్టింది. జూన్ 9న అమిత్ 19 ఏళ్ల కుమారుడు అనీష్ బ్రహ్మే ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతోనే ఈ  ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో అమిత్ రాసిన సూసైడ్ నోట్  లభించింది. తన చావుకు గల కారణాలను, తను అనుభవించిన నరకాన్ని అమిత్ అభయ్ బ్రహ్మే ఆ లేఖలో కళ్లకు కట్టాడు. 

ఆ సూసైడ్ నోట్‌లో అమిత్ బ్రహ్మే తన సహోద్యోగినులు అర్చన, శశ్వతిలపై   తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ ఇద్దరు మహిళా ఉద్యోగులు ఆఫీసులో అందరి ముందూ తనను పదేపదే అవమానించే వారనీ, మానసికంగా కుంగిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అసలు నైపుణ్యం,  అనుభవం లేని ప్రాజెక్టులను కావాలనే అప్పగించి, ఆపై పనితీరు సరిగా లేదంటూ బహిరంగంగా మందలించేవారని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా.. ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేయాలంటూ  తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారని పేర్కొన్నాడు. దీనికి తోడు, అమిత్ స్నేహితుడు వినోద్ పలిచా సైతం నమ్మకద్రోహానికి పాల్పడ్డాడు. కంపెనీ యాజమాన్యానికి అమిత్‌పై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ ఈమెయిల్స్ పంపి, ఆయన కెరీర్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించాడని ఆ లేఖ ద్వారా తెలిసింది.

బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు,  లభించిన ఆధారాల మేరకు  పోలీసులు  అర్చన, శశ్వతి మరియు వినోద్ పలిచాలపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదనీ.. పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈఘటనపై టీసీఎస్ యాజమాన్యం స్పందించింది. తమ సంస్థలో ఉద్యోగుల మానసిక శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెబుతూ, మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటించింది. అంతర్గతంగా విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేలుస్తామని హామీ ఇచ్చింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...