బంగ్లా ప్రధాని తారిక ప్రమాణస్వీకారోత్సవానికి మోదీ దూరం!
posted on: Feb 15, 2026 4:08PM
.webp)
బంగ్లాదేశ్‌లో రాజకీయాల్లో దశాబ్ద కాలానికి పైగా సాగిన ప్రతిష్టంభనకు తెరదించుతూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడు తారిక్ రెహమాన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన ఢాకాలో జరిగే ఈ మెగా ఈవెంట్‌కు ప్రపంచ దేశాల నేతలు తరలిరానుండటంతో దౌత్యపరమైన వేడి రాజుకుంది. ముఖ్యంగా భారత ప్రధాని మోడీకి ప్రత్యేక ఆహ్వానం అందగా.. ఆయన వెళ్తారా లేదా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ మళ్లీ అధికార పగ్గాలు చేపడుతోంది.
ఢాకాలోని పార్లమెంట్ హౌస్ సదరన్ ప్లాజా వేదికగా జరగనున్న తారిక్ ప్రమాణస్వీకరోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 17 ఉదయం నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకారం జరుగుతుంది. అనంతరం సాయంత్రం వేళ ప్రధాన మంత్రిగా తారిక్ రెహమాన్, ఆయన కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏఎమ్ఎమ్ నాసిర్ ఉద్దీన్ ఈ ప్రమాణ స్వీకార ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారత్, చైనా, పాకిస్థాన్, సౌదీ అరేబియా సహా మొత్తం 13 దేశాల అధినేతలకు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ అధికారికంగా ఆహ్వానాలు పంపారు.
ముఖ్యంగా ఈ వేడుకకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ఆహ్వానం అందింది. అయితే అదే రోజు ముంబైలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి ప్రధాని మోదీకి భేటీ కానున్నారు. గతంలోనే ఈ సమావేశాన్ని నిర్ణయించగా.. ఆయన ఈ పర్యటనకు హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సమాచారం. ప్రధాని మోడీ స్థానంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ లేదా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ భారత్ తరపున ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తారిక్ రెహమాన్ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం భారత్‌తో ఎలా ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారుతోంది. గతంలో బీఎన్‌పీ హయాంలో కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ.. ఈసారి ఆ పార్టీ నేతలు ప్రాంతీయ సహకారం, వాణిజ్యం, స్థిరత్వం గురించి సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్ ఏ స్థాయిలో ఈ వేడుకకు ప్రాతినిధ్యం వహిస్తుందనే దానిపై ఇరు దేశాల భవిష్యత్ సంబంధాలు ఆధారపడి ఉంటాయని దౌత్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.






