Latest News

మహిళా దినోత్సవ వేళ... టీవీకే చీఫ్ విజయ్ వరాలు జల్లు

posted on: Mar 7, 2026 7:34PM

 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ భారీ వరాలు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం దినోత్సవం వేడుకల్లో మహిళలకు విజయ్ హామీల వర్షం కురిపించారు. టీవీకే అధికారంలో వస్తే నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, యువతులకు పెళ్లి కోసం 8 గ్రాముల గోల్డ్, పట్టుచీర, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీల వర్షం కురిపించారు.

ప్రభుత్వ ఉద్యోగులు మినహా 60 సంవత్సరాల లోపు మహిళలందరికీ నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని విజయ్ తెలిపారు. అన్నపూరణి సూపర్ సిక్స్ పథకం కింద ప్రతి ఏడాది ఆరు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చెప్పారు. అలాగే రేషన్ దుకాణాల ద్వారా మహిళలకు ఉచితంగా సానిటరీ ప్యాడ్స్ అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

కామరాజర్ కల్వి ఉరుతి తిట్టం పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. మహిళలపై జరిగే నేరాలను త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రజా రవాణా వాహనాల్లో ‘స్మార్ట్ పానిక్ బటన్’లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలిపారు. మహిళల భద్రత కోసం పోలీసు వ్యవస్థలో “రాణి వేలు నచియార్” ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే నవజాత శిశువులకు బంగారు ఉంగరం, బేబీ కిట్ అందించే పథకాన్ని కూడా ప్రకటించారు. మామల్లపురంలో టీవీకే ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ డే దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ ఈ హామీలను ప్రకటించారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...