మద్యం దుకాణాలపై తమిళనాడు సీఎం విజయ్ తొలి వేటు!

posted on: May 12, 2026 12:47PM

తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం అటు సామాజికంగా, ఇటు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. పాఠశాలలు, దేవాలయాలు, బస్టాండ్‌ల సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేస్తూ  ఆదేశాలు జారీ చేసి సంచలనం సృష్టించారు.

తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.  ఎందుకంటే వీటి మూసివేతతో మిగిలిన దుకాణాల వద్ద అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. కాబ‌ట్టి   ఆదాయానికి వ‌చ్చే లోటు ఉండ‌దు. మ‌ద్యం కావాల‌నుకునేవారు ఇక్క‌డ దొర‌క్కంటే మరో చోట  కొనుక్కుంటారు. 

ఇక విజయ్ వ్యూహం ఏంటో చూస్తే.. ఆయ‌న‌ లక్ష్యం సంపూర్ణ మద్యపాన నిషేధం అయితే కాదు.  నియంత్రిత విక్రయాలు మాత్ర‌మే. ప్రజల నుంచి విమర్శలు వస్తున్న సెన్సిటివ్ ఏరియాల్లో దుకాణాలు తొలగించడం ద్వారా ఆయన ఒక క్లీన్ ఇమేజ్, సోషల్ రిఫార్మర్  గా గుర్తింపు పొందే అవకాశం ఉంది. 

అయితే..   ఇదే అంశాన్ని ఏపీలో జ‌గ‌న్ సంపూర్ణ మ‌ద్య పాన నిషేధం అని చెప్పి సాగించిన విచ్చ‌ల‌విడి విధానాల‌తో ముడి పెట్టి చూస్తున్నారు కొంద‌రు. ఆనాడు..  జ‌గ‌న్  ద‌శలవారీ నిషేధం అని చెప్పి ప్రభుత్వమే దుకాణాలు నడిపింది. అప్ప‌టి  వ‌ర‌కూ మార్కెట్లో ఉన్న పాపుల‌ర్ బ్రాండ్ల‌ను ప‌క్క‌న పెట్టి బూమ్ బూమ్ వంటి  కొత్త  ర‌కాల‌ను ప్ర‌వేశ  పెట్టింది. అంతే కాదు ఆయా లిక్క‌ర్ సిండికేట్ల‌ను పెద్ద ఎత్తున ప్రోత్స‌హించి ముడుపులు తీసుకుంది. దేశంలోనే  అతి పెద్ద లిక్క‌ర్ స్కామ్  కి దారులు ప‌రిచింది నాటి వైసీపీ ప్ర‌భుత్వం.  
 
అదే విజ‌య్ తీసుకున్న నిర్ణ‌యాలు భ‌విష్య‌త్ లో బ‌డులు, గుడులు, బ‌స్టాండ్ వంటి  బ‌హిరంగ  ప్ర‌దేశాల్లో మందుబాబుల అరాచ‌కాలు త‌గ్గి.. త‌ద్వారా విజ‌య్ ప్ర‌భుత్వం  ప‌ట్ల మ‌హిళా  ఓట‌ర్ల‌లో ఒక ర‌క‌మైన న‌మ్మ‌కం  ఏర్ప‌డే అవకాశం ఉంది. మద్యం మాఫియా, సిండికేట్లకు తావులేకుండా దుకాణాల నిర్వహణలో పారదర్శకత వస్తుందని ఆశిస్తున్నారు అక్క‌డి ప్ర‌జ‌లు.

అదే జగన్  ఏపీలో మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ప్రయోగాలు చేసి చివరకు   విమర్శలకు గురయ్యారు. విజయ్ మాత్రం ఆదాయం కంటే  ప్రజా క్షేమం  ముఖ్యమని స్పష్టమైన సంకేతం ఇచ్చారు.  అయితే, ఈ 48 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోకుండా రాష్ట్ర బడ్జెట్‌ను ఎలా మేనేజ్ చేస్తారో చూడాలని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక‌ ఆదాయం తగ్గితే, ఆ లోటును భర్తీ చేయడానికి విజయ్ ప్రభుత్వం ఇతర మార్గాలను అన్వేషించాల్సి  ఉంటుందని అంటున్నారు నిపుణులు. ప‌న్నుల్లో సంస్క‌ర‌ణ‌లు తేవాల్సి ఉంటుందంటున్నారు. పారిశ్రామికాభివృద్ధి మ‌రింత‌గా విస్త‌రింప చేయాల్సి ఉంటుందనీ సూచిస్తున్నారు. ఏది ఏమైనా విజ‌య్ మార్క్ పాల‌నైతే త‌మిళ‌నాడులో షురూ అయిన‌ట్టుగానే  క‌నిపిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...