Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళ ఓటర్ల తీర్పు ఇదేనా... లోక్ పోల్స్ సర్వేలో ఆసక్తికర ట్రెండ్!
posted on: Apr 8, 2026 3:25PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 23న పోలింగ్ జరగనున్న తరుణంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం అత్యంత వేడెక్కింది. ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే తమ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, ప్రముఖ సర్వే సంస్థ 'లోక్ పోల్' విడుదల చేసిన తుది అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో మరోసారి అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకోబోతోంది.
లోక్ పోల్ తాజా విశ్లేషణ ప్రకారం, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి భారీ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోనుంది. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో ఈ కూటమి ఏకంగా 180 నుంచి 185 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. విపక్షాల విమర్శలు, అధికార వ్యతిరేకత వంటి అంశాలను దాటుకుని స్టాలిన్ సర్కార్ దూసుకుపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి ఈ ఎన్నికలు నిరాశనే మిగిల్చేలా కనిపిస్తున్నాయి. ఈ కూటమి కేవలం 40 నుంచి 44 స్థానాలకే పరిమితం కావచ్చని సర్వే అంచనా వేసింది. గత ఎన్నికలతో పోలిస్తే విపక్ష శిబిరం ఓట్ల శాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో అన్నాడీఎంకే బలహీనపడటం డీఎంకేకు కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది.
మరోవైపు, సినీ నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ ఎన్నికల బరిలో ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అయితే లోక్ పోల్ సర్వే ప్రకారం, విజయ్ పార్టీకి సుమారు 8 నుంచి 10 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉంది. సీట్ల పరంగా తక్కువగా ఉన్నప్పటికీ, సుమారు 22.5 శాతం ఓట్ల వాటాను ఈ కొత్త పార్టీ దక్కించుకోనుండటం విశేషం.
ముఖ్యమంత్రి రేసులో ఎవరనే ప్రశ్నకు మెజారిటీ ఓటర్లు ఎంకే స్టాలిన్ వైపే మొగ్గు చూపారు. సుమారు 43 శాతం మంది ప్రజలు స్టాలిన్ మరోసారి సీఎం కావాలని కోరుకుంటుండగా, విజయ్ కు 28 శాతం, పళనిస్వామికి 22 శాతం మద్దతు లభించింది. ప్రజాకర్షక పథకాలు, పరిపాలనలో స్టాలిన్ ముద్ర ఓటర్లను ఆకట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సర్వే ఫలితాలు డీఎంకే శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుండగా, విపక్షాలు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని, ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని అన్నాడీఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుంది, అది ఏ కూటమికి నష్టం చేకూరుస్తుంది అనే అంశంపై కూడా చర్చలు జోరందుకున్నాయి.
మరో కొద్ది రోజుల్లో జరగబోయే పోలింగ్, ఆపై వెలువడే ఫలితాలు తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. లోక్ పోల్ అంచనాలు నిజమవుతాయా లేక తమిళ తంబీలు ఊహించని తీర్పునిస్తారా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం స్టాలిన్ సేన మరోసారి కోటపై జెండా పాతేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.






