Latest News

జయలలిత 'కొడుకు' జైలు పాలు!

posted on: Mar 27, 2017 7:02PM

 

జయలలిత... ఈ పదం చాలా పవర్ ఫుల్! అవునులెండీ, బతికుండగా ఆమెకు తిరుగేలేదు... అనేయకండీ! జయ చనిపోయినా కూడా ఆమె పేరు అణుబాంబులా పేలుతూనే వుంది. అసలు మరణమే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ లా రోజుల తరబడి కొనసాగింది. 75రోజుల హైడ్రామా తరువాత పురుచ్ఛి తలైవీ సమాధిలోకి చేరుకుంది. ఇక ఆ తరువాత జరిగిన శశికళ, పన్నీర్ కుర్చీ యుద్ధం కూడా మనకు తెలిసిందే! పన్నీర్ ఓడి గెలిచాడు. శశికళ గెలిచి ఓడింది. అంతటికీ కారణం... జయలలిత అన్న పేరే! ఆమె పేరు చెప్పుకునే చిన్నమ్మ, పన్నీరు, మేనకోడలు దీప... ఇలా అందరూ వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మరో వ్యక్తి కూడా జయలలిత పేరెత్తి న్యూస్ మేకర్ అయ్యాడు! అయితే, త్వరలో చిప్పకూడు కూడా తినబోతున్నాడు ఆ మహానుభావుడు!

 

జయలలిత క్రేజ్ అనే ల్యాండ్ మైన్ మీద కాలెట్టిన సదరు సన్నాసి ఎవరంటే ... జే. కృష్ణమూర్తి! ఈయన వారం క్రితం ఏకంగా చెన్నై హైకోర్ట్ ను ఆశ్రయించాడు. తాను జయలలిత కొడుకునన్నాడు. పనిలో పనిగా తన తండ్రి తెలుగు వారి ఆరాధ్యనటుడు శోభన్ బాబు అని కూడా చెప్పాడు! ఒకవేళ ఆయన చెప్పిందంతా నిజమై వుంటే... ఈ పాటికి తమిళ, తెలుగు రాష్ట్రాల సెలబ్రిటీ అయ్యేవాడు కృష్ణమూర్తి! కాని, డామిట్ కథ అడ్డం తిరిగిందన్నట్టు... కృష్ణమూర్తి జయ కొడుకూ కాదు... శోభన్ బాబు అతగాడి బాబూ కాదని తేలింది.

 

చెన్నై హైకోర్ట్ కృష్ణమూర్తి పట్టుకొచ్చిన డాక్యుమెంట్స్ పోలీసులకి అప్పగించాలని గతంలో చెప్పింది. అలాగే చేయగా అవ్వి ఫోర్టరీ చేసినవని తేలింది. కృష్ణమూర్తి పాత స్టాంపు పేపర్లు కొని వాటిపై జయలలిత పేరును కోమలవల్లిగా పేర్కొంటే ఆమె సంతకం కూడా ఫోర్జరీ చేశాడు! ఇక ఆయనగారి అసలు తల్లిదండ్రులు తిరుపూర్ లోని కృష్ణమూర్తి, వసంతమణి అని కూడా పోలీసులు దర్యాప్తులో తేల్చేశారు!

 

జయలలిత , శోభన్ బాబుల పుత్ర రత్నమైపోదామని ప్లాన్ వేసిన కృష్ణమూర్తిని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలిన కోర్ట్ ఆదేశించింది. ఈ దొంగ తనయుడు కోర్ట్ కి అబద్ధం చెప్పటమే కాక దొంగ డాక్యుమెంట్లు కూడా తయారు చేసిన నేరానికిగానూ శిక్ష ఎదుర్కోబోతున్నాడు! మొత్తం మీద జయలలిత పేరు వాడుకుని చెలరేగిపోదామనుకున్న ముదురు మేధావి అమ్మ దెబ్బకి కటకటల పాలయ్యాడు!

google-ad-img
    Related Sigment News
    • Loading...