బట్టలు విప్పితే కాని ప్రభుత్వానికి అర్థం కాదా..?

posted on: Apr 12, 2017 12:35PM

తీవ్రమైన కరువు, వ్యవసాయంలో నష్టాల కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమకు సాయం చేయాలని కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తమిళకూలీలు చేసిన నగ్న ప్రదర్శన యావత్ జాతిని ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన నిరసన వేరు..నిన్న జరిగింది వేరు. బ్యానర్లు, ఫ్లకార్డులు, డౌన్ డౌన్ అనే నినాదాలు మాత్రమే నిరసన తెలిపేందుకు ఇప్పటి వరకు వాడిన సాధనాలు. కాని తమిళ రైతులు తెలిపిన నిరసన మాత్రం వినూత్నమైనది..విభిన్నమైనది. తమను ఆదుకోవాలంటూ గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో ఉండే ఆందోళన చేస్తున్నా.. తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో నగ్నప్రదర్శనకు దిగారు  రైతులు. ఏకంగా శరీరంపై నూలు పోగు లేకుండా మొండిమొలతో పార్లమెంట్ సౌత్ బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయం ఎదుట పొర్లు దండాలు పెడుతూ..పీఎంవోలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

 

ఈ వార్త దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. అయితే ఇలాంటి నగ్న ప్రదర్శనలు భారతావనికి కొత్త కాదు. 2004లో మనోరమ అనే మహిళను అస్సాం రైఫిల్స్‌కు చెందిన సైనికులు విచారణ పేరిట బలవంతంగా లాక్కొని వెళ్లారు. ఆ మరుసటి రోజు ఆమె అర్థనగ్నంగా రోడ్డుపై శవమై తేలింది. ఆమె మృతదేహాన్ని చూసిన ఎవరికైనా మనోరమ అత్యాచారానికి గురైందని అర్థమవుతుంది. ఆమె హత్యకు నిరసనగా పదకొండు మంది మహిళలు పూర్తిగా వివస్త్రలై నగ్నంగా ప్రదర్శన నిర్వహించి సంచలనం సృష్టించారు.

 

"సైనికులారా మమ్మల్ని కూడా రేప్ చేయండి" అని రాసి ఉన్న బ్యానర్ ప్రదర్శిస్తూ అస్సాం రైఫిల్స్ కార్యాలయం ముందు నగ్న ప్రదర్శన చేశారు. ఇంత ధైర్యం చేసినా న్యాయం జరిగింది లేదు. కారణం, ఆనాడు ఇంతటి మీడియా సౌలభ్యం లేదు..పైగా అస్సాం రైఫిల్స్ ఉన్నతాధికారులు ఈ వార్తను బయటకు రానీయలేదు. కానీ నిన్న తమిళ రైతులు ఏకంగా దేశ రాజధానిలోనే నగ్న దీక్ష చేయడంతో మీడియా, రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రజలు అందరూ అటెన్షన్ అయ్యారు. దీనిని చూసిన కొందరు యువత బట్టలు విప్పితే కానీ పాలకులు మాట వినరంటూ సెటైర్లు వేస్తున్నారు..చూస్తే అది నిజమే అనిపిస్తుంది కదూ.

google-ad-img
    Related Sigment News
    • Loading...