నైతిక విలువలా? అంటే ఏంటి తలసానీ?

 

తెలంగాణా కోసం ఉద్యమించిన తెరాస నేతలకు, ఉద్యమకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీలో నుండి బయటకు వచ్చి తెరాసలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావులకు మాత్రం మంత్రి పదవులు కట్టబెట్టారు. నిజానికి వారిరువురూ ఆ షరతు మీదే పార్టీ మారినట్లు వార్తలు వచ్చేయి. తెదేపా తరపున శాసనసభకు ఎంపికయిన తలసాని తదితరులు పార్టీ ఫిరాయించినందుకు వారిపై అనర్హత వేటు వేయాలని తెదేపా కోరడం, స్పీకర్ వారికి నోటీసులు జారీ చేయడం గురించి అందరికీ తెలిసిందే.

 

తెరాసలోకి మారి మంత్రిపదవి సంపాదించుకొన్న తలసాని యాదవ్ ఈ అనర్హత వేటు తప్పించుకొనేందుకు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. లేకుంటే ఆయనపై అనర్హత వేటు పడితే మంత్రి పదవి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అదీగాక ఆయన ఇప్పుడు తెదేపా శాసనసభ్యుడిగా కొనసాగే పరిస్థితి కూడా లేదు. కొనసాగితే ప్రతిపక్షాలకు, ముఖ్యంగా తెదేపా సందించే ప్రశ్నలకు, విమర్శలకు జవాబు చెప్పుకోవడం ఆయనకీ, ప్రభుత్వానికీ కూడా చాలా కష్టమవుతుంది. అందుకే ఆయన మంత్రి పదవి చేప్పట్టే ముందే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. అయితే ఆయన దానికి ‘నైతిక విలువల’ రంగులద్దే ప్రయత్నం చేయడం అందరికీ నవ్వు కలిగిస్తుంది.

 

తను నైతిక విలువలకు కట్టుబడే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసానని ఆయన చెప్పుకొన్నారు. నైతిక విలువల గురించి తను వేరేవారి దగ్గరో పాటాలు నేర్చుకోనవసరం లేదని అన్నారు. మంత్రి పదవి కోసమే పార్టీ ఫిరాయించానని ఎవరేమనుకొన్నా తను పట్టించుకోనని అన్నారు. కానీ తనపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించబోనని ఒక హెచ్చరిక కూడా జారీ చేసారు. చంద్రబాబు కూడా నోరు అదుపులో ఉంచుకొంటే మంచిదని అన్నారు. ఆయన మంత్రి పదవి చేప్పట్టబోతున్నందుకు చాలా ఆనందంపడిన ఆయన తల్లిగారు, తనకు పెద్దకొడుకు వంటి చంద్రబాబు నాయుడికి తన కొడుకు దూరం కావడం తనకు చాలా బాధ కలిగిస్తోందని చెప్పడం గమనిస్తే తలసాని ఏమి కోల్పోయారో అర్ధమవుతుంది.

 

ఆయన మంత్రి పదవి కోసమే తను పార్టీ ఫిరాయించానని ఎవరేమనుకొన్నా తను పట్టించుకోనని చెప్పుకోవడం ద్వారా ఆ ఆరోపణలు నిజమని ఆయనే స్వయంగా దృవీకరిస్తున్నట్లుంది. తనకు సమాజంలో ఈ హోదా, గౌరవం కలిగించిన పార్టీని మంత్రి పదవి కోసమే వీడినప్పుడే ఆయన నైతిక విలువలను తుంగలో తొక్కారు. అటువంటప్పుడు ఆయన నైతిక విలువలు కాపాడేందుకే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసానని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

 

రాజకీయ నాయకులు పార్టీలు మారితే జానాలు ఆశ్చర్యపోయే రోజులు ఎప్పుడో పోయాయి. మారకపోతేనే వారు ఆశ్చర్యపోతుంటారు. అటువంటప్పుడు నైతిక విలువలను కాపాడేందుకే తన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసానని తలసాని చెప్పుకోవడం కూడా అనవసరం. ఇప్పుడు మన రాజకీయ వ్యవస్థలో నేతలు తమను తాము సమర్దించుకొనేందుకు అవసరమయిన కొన్నిమూస పద్దతులు, కొన్ని నిశ్చితమయిన వాదనలు, వాటికి అవసరమయిన పడికట్టు పదాలు అన్నీ సిద్దంగా ఉన్నాయి. కనుక నేతలందరూ ఇటువంటి సందర్భాలలో వాటి నుండి తమకు అవసరమయిన పాయింట్లు, పద్దతులు, పదాలు ఏరుకొని మీడియా ముందుకు వచ్చి తదనుగుణంగా చిలకల్లా వల్లె వేస్తుంటారు. ఆ మూస పద్దతులను, పడికట్టు పదాలను ఉపయోగించడం వలన పెద్దగా విమర్శల బారిన పడకుండా తప్పించుకోగలుగుతున్నారు.

 

తలసాని కూడా అటువంటిదే ‘నా హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకోనేందుకే పార్టీ మారానని’ పద్ధతి ప్రకారం బాగానే చెప్పినప్పటికీ ఈ ‘నైతిక విలువల’ సంగతి ఎత్తడం వల్ల ఇంత ఆలోచించవలసి వచ్చింది. లేకుంటే ఆయనని కూడా నలుగురితో నారాయణ అనేసి ఊరుకొనేవారు.