బీఆర్‌ఎస్ హయాంలో 69 వేల ఇండ్లు కట్టాం..దమ్ముంటే చర్చకు రండి : తలసాని సవాల్

posted on: Aug 14, 2026 5:43PM

 

కేసీఆర్ ఉచితంగా ఇస్తే.. ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షలా..!

తెలంగాణ రాజకీయాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణంపై మళ్లీ తీవ్ర చర్చ మొదలైంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల కోసం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల వ్యవహారంపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు  మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తలసాని మాట్లాడారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను సుదీర్ఘంగా వివరించడమే కాకుండా, దమ్ముంటే తమతో వచ్చి తాము నిర్మించిన ఇండ్లను, అక్కడ ఎంతో ఆనందంగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలను స్వయంగా చూడాలని సవాల్ విసిరారు.

హైదరాబాద్ మహానగరంలో బీఆర్‌ఎస్ పాలనలోనే ఏకంగా 69,000 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని తలసాని అత్యంత స్పష్టమైన గణాంకాలతో వెల్లడించారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొల్లూరు ప్రాంతంలో ఒక్కచోటే ఏకంగా 16,000 ఇండ్లను సకల సౌకర్యాలతో మోడల్ టౌన్‌షిప్‌లాగా నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన గర్వంగా గుర్తుచేశారు. 

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అత్యున్నత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేటాయించే ప్రభుత్వ క్వార్టర్స్ కూడా ఇంత అద్భుతంగా ఉండవని ఆనాడు రాష్ట్రానికి చెందిన గవర్నర్ స్వయంగా ఈ ఇండ్లను సందర్శించి ప్రశంసల వర్షం కురిపించారని తలసాని ప్రస్తావించారు. అంతేకాకుండా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆనాడు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న సమయంలో కూడా ఈ కొల్లూరు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల వద్దకు స్వయంగా తీసుకెళ్లి ప్రాజెక్టు నాణ్యతను చూపించిన విషయాన్ని మీడియా వేదికగా గుర్తుచేశారు.

గతంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఒక్కో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు యూనిట్ కాస్ట్ వచ్చేసి రూ. 9.50 లక్షల వరకు అయిందని, అయినా సరే పేద ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా రూపాయి తీసుకోకుండా ఉచితంగా అందించామని తెలిపారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తామని చెబుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మాత్రం పేదల నుంచి లబ్ధిదారుడి వాటాగా ఏకంగా రూ. 6 లక్షలు వసూలు చేయాలని చూస్తున్నారని, దీనితో పాటు దరఖాస్తు చేసుకోవడానికే ఉమ్మడి రాష్ట్రం తరహాలో మరో రూ. 10,000 వసూలు చేసేందుకు మెలికలు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఒక్కో లబ్ధిదారుడికి ఎన్ని గజాల విస్తీర్ణంలో స్థలం ఇచ్చి ఇల్లు నిర్మిస్తారనే స్పష్టతను ఈ ప్రభుత్వం ఎక్కడా ఇవ్వకపోవడం గమనార్హమని ఆయన విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో రూ. 10,000 తీసుకుని కూడా చివరికి ఇండ్లు ఇవ్వకుండా పేదలను మోసం చేసిన చరిత్ర ఉందని తలసాని దుయ్యబట్టారు.

మరొకవైపు పేద ప్రజలకు చెందిన భూములు  నివాస ఇండ్లను నిషేధిత జాబితా అయిన 22A కేటగిరీలో పొందుపరిచి పేదలను వేధిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని తలసాని సంచలన ఆరోపణలు చేశారు. ఏమీ తెలియనట్లుగా 22A జాబితాలో ఉన్న భూములపై "మీ భూమి మీకే ఇప్పిస్తాం" అంటూ వ్యాఖ్యానించడం సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. 

ప్రజల సొంత భూములను తిరిగి ప్రజలకే ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరని ఆయన నిలదీశారు. 22A జాబితా నుంచి భూములను తొలగించి క్లియరెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం 30 శాతం నుంచి 40 శాతం వరకు భారీ కమీషన్లు వసూలు చేస్తోందని తలసాని బాంబు పేల్చారు. చివరగా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పీఠంలో ఉండి రేవంత్ రెడ్డి క్షుద్ర పూజల గురించి మాట్లాడటం అత్యంత శోచనీయమని, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు.

Talasani Srinivas Yadav, CM Revanth Reddy, Double Bedroom Houses Telangana, BRS Double Bedroom Scheme, Kollur 2BHK Housing Project, Indiramma Indlu Scheme

google-ad-img
    Related Sigment News
    • Loading...