కేసీఆర్ తోడేలు కాదు.. నక్క!

 

 

 

మొన్నటి వరకూ ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేస్తున్న కొంగలాగా శాంతియుతంగా కనిపించిన కేసీఆర్ లేటెస్ట్ గా మళ్ళీ సీమాంధ్రుల మీద, కాంగ్రెస్ నాయకుల మీద నోరు చేసుకోవడం మొదలెట్టారు. ఆప్షన్లుండవు.. ఆంధ్రోళ్ళు వెళ్ళిపోవాల్సిందే లాంటి గుండెల్ని మండించే మాటల్ని అటుంచితే, మొన్నటి వరకూ కాంగ్రెస్ వాళ్ళని కీర్తించిన నోటితోనే ఇప్పుడు తెగ తిడుతున్నాడు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తోడేళ్ళ లాంటి వాళ్ళని తేల్చేశాడు. నిజం నిష్టూరంగానే వుంటుంది కాబట్టి కేసీఆర్ అన్న మాట తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఆగ్రహం తెప్పించింది.

 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు మేం తోడేళ్ళం కాదు కేసీఆరే తెలంగాణ ప్రజల్ని మింగడానికి రెడీగా వున్న పెద్ద తోడేలు అని ఎదురుదాడి చేశారు. మొత్తమ్మీద ఒకరినొకరు తోడేళ్ళని తిట్టుకున్నారు. దాంతో ఇద్దరూ తోడేళ్ళే అని, తెలంగాణ ప్రజలే అమాయక గొర్రెలని వాళ్ళు చెప్పకనే చెబుతున్నారు. ఒకర్నొకరు తిట్టుకున్నారు కాబట్టి ఇక్కడితో ఈ తోడేలు ఎపిసోడ్ ముగిసినట్టేనని రాజకీయ పరిశీలకులు అనుకున్నారు. అయితే మరికొందరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ ఇష్యూని మరికొంత సాగదీశారు. టోటల్ తెలంగాణలో సీమాంధ్రులకు నచ్చే ఇద్దరు నాయకులు జగ్గారెడ్డి, రేణుకా చౌదరి ఈ ఇష్యూలో మరింత ముందుకు వెళ్ళారు.

ఎవరు తోడేళ్ళో తెలంగాణ ప్రజలు ఎన్నికల తర్వాత నిరూపిస్తారని, కేసీఆర్‌కి తమ గురించి మాట్లాడేంత సీన్ లేదని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తిట్టిపోయడంలో కేసీఆర్‌కి కరెక్ట్ మొగుడులా వుండే జగ్గారెడ్డి మాత్రం కేసీఆర్ తోడేలు కాదని అన్నారు. ఆయనగారు తోడేలు కాదు.. నిఖార్సయిన నక్క అని డిసైడ్ చేశారు. కేసీఆర్ రాజకీయాల్లో తన నక్కబుద్ధిని బయటపెట్టుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని, గోతికాడి నక్కలాగా లాభం పొందాలని చూస్తున్నాడని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ సీమాంధ్రుల మీద, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద మాటలతో దాడి చేస్తున్న కేసీఆర్ తన నక్కబుద్ధులు మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu