Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీలో కూటమి రెండేళ్ల పాలనపై సువేరా విశ్లేషణ.. అదే అవినీతి, అదే దోపిడీ!
posted on: Jun 25, 2026 2:51PM
.webp)
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికరమైన విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సువేరా తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. ప్రస్తుత ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పరిపాలనకు వందకు కేవలం 35 మార్కులు అంటే కేవలం పాస్ మార్కులు మాత్రమే వస్తాయన్నారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అపారమైన నమ్మకాన్ని, 56 భారీ ఓట్ల శాతాన్ని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విఫలమవుతోందని సువేరా విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే.. గెలుపే పరమావధిగా భావించి ఎలాంటి క్రెడిబిలిటీ లేని వ్యక్తులకు, గాలివాటంగా వచ్చిన నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడమేనని విశ్లేషించారు. ఆ తర్వాత జరిగిన క్యాబినెట్ కూర్పు కూడా తీవ్ర నిరాశకు గురిచేసిందని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న సీనియర్లను పూర్తిగా పక్కనబెట్టారని మండిపడ్డారు.
ప్రస్తుత పాలనలో ప్రభుత్వ పాలసీలు బాగానే ఉన్నప్పటికీ.. నియోజకవర్గాల్లో అవినీతి, దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నాయని సువేరా ఆరోపించారు. ముఖ్యంగా గ్రామాల్లో మట్టి, ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోందని, దీని వెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల హస్తం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఒకప్పుడు ఉచితంగా లభించే మట్టిపై ఇప్పుడు మాఫియా ముఠాలు రాబందుల్లా వాలిపోతున్నాయని, ప్రతి చిన్న విషయానికి మైనింగ్ విభాగాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
"గత ప్రభుత్వంలో ఉన్న అరాచకాలు లేకపోవడం, లా అండ్ ఆర్డర్ కాస్త మెరుగ్గా ఉండటం వల్ల హ్యాపీనెస్ ఇండెక్స్ కొంతవరకు బాగుంది. కానీ క్షేత్రస్థాయి అవినీతిలో మాత్రం గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి పెద్దగా తేడా కనిపించడం లేదని సువేరా విశ్లేషంచారు. ఇదే సమయంలో పార్టీ సంస్థాగత లోపాలపై కూడా ఆయన సునిశిత విమర్శలు చేశారు. 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి కార్యకర్తలతో నడపడం మానేసి, కార్పొరేట్ సలహాదారుల చేతుల్లో పెట్టడం దారుణమన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి జెండా మోసిన కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు దక్కడం లేదని, ఇటీవల జరిగిన మూడు రాజ్యసభ సీట్ల కేటాయింపు కూడా విస్మయానికి గురిచేసిందని దుయ్యబట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై పైస్థాయి నుంచి ఎలాంటి మానిటరింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల సుమారు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని సువేరా పేర్కొన్నారు.
ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంలో కూటమి మంత్రులు, అధికార ప్రతినిధులు ఘోరంగా విఫలమవుతున్నారనీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంటల కొద్దీ పాత విషయాలు మాట్లాడటం తగ్గించి.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలని హితవు పలికారు. అలాగే ఐటీ మంత్రి నారా లోకేష్ కనీసం వారానికి ఒకసారి మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ పాలసీలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ప్రతిపక్షం మళ్లీ వస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తుందనే భయాన్ని చూపిస్తూ ఎక్కువ కాలం ప్రజలను మభ్యపెట్టలేరని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా తన తప్పులను సరిదిద్దుకుని, అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి పుట్టుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని సువేరా హెచ్చరించారు. గతంలో ప్రజారాజ్యం వంటి ప్రత్యామ్నాయాలు విఫలమైనప్పటికీ, ప్రస్తుత నాయకత్వం చేతకానితనం వల్ల ప్రజలు కొత్త దిక్కును వెతుక్కోవడం ఖాయమని విశ్లేషించారు. ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల్లో కూటమి భవితవ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని విశ్లేషించారు సువేరా.






