అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో వైభవ్ సూర్యవంశి విధ్వంసం

posted on: Feb 6, 2026 4:08PM

14 ఏళ్ల కుర్రాడు అండర్ 19 వరల్డ్ కప్ లో రికార్డుల మోత మోగించేశాడు. టీమ్ ఇండియా అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్స్ లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో  పలు రికార్డులు బద్దలు కొట్టేశాడు.  హరారే వేదికగా ఇంగ్లాండ్ తో  జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా అండర్ 19 జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  ఓపెనర్ గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ కేవలం 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.

ఈ క్రమంలో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. 2022లో రాజ్ అంగద్ బవా 69 బంతుల్లో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. 14 ఏళ్ల వైభవ్ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా కూడా ఘనత సాధించాడు. ఇక‌, త‌న తుపాను ఇన్సింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాదిన వైభవ్.. మొత్తం 80 బంతుల్లో 175 పరుగులతో ఇంగ్లంగ్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు.

ఈ భారీ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఆయుష్ మాత్రే (53)తో కలిసి రెండో వికెట్‌కు 142 పరుగులు, ఆ తర్వాత వేదాంత్ త్రివేదితో కలిసి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.  అండర్ 19 టోర్నీలో ఫైనల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా సూర్యవంశి రికార్డు సృష్టించాడు. అంతే కాకుండా ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ లో  అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా వరల్డ్ రికార్డు సాధించాడు.  సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్  నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించి.. ఇంగ్లాండ్ ముందు 412 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. సూర్యవంశి 175 పరుగులలో 15 ఫోర్లు, 15 సిక్సులు ఉన్నాయి. అండర్ 19 వన్డే టోర్నీలో ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాటర్ గా కూడా సూర్యవంశీ రికార్డు సాధించాడు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...