Latest News

ఏటీఎం బంపర్ ఆఫర్... పది వేలకు మూడు లక్షలు రావడంతో షాకైన వ్యక్తి!

posted on: Mar 20, 2026 9:14PM

 

గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన ఓ సాధారణ వ్యక్తి చేసిన పట్టుదలైన పోరాటం… చివరకు భారీ న్యాయ విజయంగా మారింది. కేవలం 10 వేల రూపాయల కోసం మొదలైన ఈ పోరాటం… దాదాపు 9 సంవత్సరాల తర్వాత 3 లక్షలకుపైగా పరిహారాన్ని సాధించింది.

2017 ఫిబ్రవరి 18న, సూరత్‌లోని ఉధ్నా ప్రాంతంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో ఆ వ్యక్తి 10 వేల రూపాయలు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించాడు. అయితే డబ్బులు రాకపోయినా… ఖాతా నుంచి మొత్తం కట్ అయిందని మెసేజ్ వచ్చింది. రిసీప్ట్ కూడా రాకపోవడంతో అతడు వెంటనే తన హోమ్ బ్రాంచ్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఫిర్యాదు చేశాడు.

ఫిబ్రవరి 21న ఇచ్చిన ఫిర్యాదుపై “చూస్తాం” అన్న మాట తప్ప… నెలలు గడిచినా ఎలాంటి పరిష్కారం రాలేదు. ఆ తర్వాత ఎన్నో ఈమెయిల్స్, లెటర్స్ పంపినా స్పందన లేకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేశాడు. ఎస్‌బీఐ ఏటీఎంకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కోసం ఆర్టీఐ కూడా వేశాడు. అయినా న్యాయం దొరకకపోవడంతో… 2017 డిసెంబర్‌లో కన్జూమర్ ఫోరంను ఆశ్రయించాడు.

కేసు విచారణలో… ఏటీఎం ఎస్‌బీఐదని, తమకు సంబంధం లేదని బ్యాంక్ ఆఫ్ బరోడా వాదించింది. ట్రాన్జాక్షన్ సక్సెస్ అయినట్లు రికార్డుల్లో ఉందని చెబుతూ బాధ్యత తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ వాదనలను కన్జూమర్ ఫోరం తిరస్కరించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 5 రోజుల్లోనే డబ్బులు రీఫండ్ చేయాల్సిందిగా స్పష్టం చేసింది.

చివరికి కోర్టు ఆదేశాలతో… కస్టమర్‌కు వడ్డీతో సహా భారీ పరిహారం చెల్లించాల్సి వచ్చింది. 10 వేల రూపాయలపై ఏడాదికి 9 శాతం వడ్డీతో పాటు… ఆలస్యానికి రోజుకు 100 రూపాయల చొప్పున 3,288 రోజుల డిలేకు మొత్తం 3 లక్షల 28 వేల 800 రూపాయలు చెల్లించారు. అదనంగా మానసిక వేధనకు 3 వేల రూపాయలు, లీగల్ ఖర్చులకు 2 వేల రూపాయలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.

“డబ్బులు ఎంత వచ్చాయన్నది కాదు… న్యాయం దక్కింది అన్నదే ముఖ్యమని” ఆ వ్యక్తి ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఘటన… బ్యాంకుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు లేవనెత్తడమే కాకుండా, సాధారణ వినియోగదారుడు కూడా పట్టుదలతో పోరాడితే న్యాయం సాధ్యమని స్పష్టం చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...