Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీహార్ మంత్రికి సుప్రీం షాక్!
posted on: Jun 16, 2026 12:44PM

బీహార్ రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దీపక్ ప్రకాష్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ లేదా శాసనమండలిలో సభ్యుడు కానప్పటికీ ఆయనను మళ్లీ మంత్రిగా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మంత్రి దీపక్ ప్రకాష్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అసలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని ఒక వ్యక్తి సుదీర్ఘ కాలం పాటు మంత్రి పదవిలో ఎలా కొనసాగుతారనే ప్రాథమిక రాజ్యాంగ ప్రశ్నను ఈ కేసు లేవనెత్తింది. సామాజిక కార్యకర్త రాకేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) పరిధిని మరోసారి చర్చకు తెచ్చింది.
ఈ వివాదం వివరాలిలా ఉన్నాయి. గత ఏడాది నవంబర్ 20, 2025న అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన కేబినెట్‌లో దీపక్ ప్రకాష్‌ను పంచాయతీరాజ్ మంత్రిగా నియమించారు. ఆ సమయానికి ఆయన చట్టసభల్లో సభ్యుడు కాదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎలాంటి సభ్యత్వం లేని వ్యక్తి అయినా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు, కానీ ఆరు నెలల లోపు అంటే ఈ ఏడాది మే 20 నాటికి అసెంబ్లీ లేదా మంండలికి ఎన్నిక కావాలి. అయితే, ఈ ఆరు నెలల గడువు ముగియడానికి ముందే బీహార్ రాజకీయాల్లో ఊహించని మార్పులు జరిగాయి. ఏప్రిల్ 15న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాత మంత్రివర్గం రద్దయింది. ఆ సమయంలో దీపక్ ప్రకాష్ కూడా తన మంత్రి పదవిని కోల్పోయారు.
ఆ తర్వాత దాదాపు 22 రోజుల విరామం అనంతరం బీహార్‌లో సమ్రాట్ చౌదరి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, పాత కేబినెట్‌లో ఉన్న దీపక్ ప్రకాష్‌ను మళ్లీ అదే పంచాయతీరాజ్ మంత్రిగా కొత్త ప్రభుత్వంలోకి తీసుకున్నారు. రాజ్యాంగ నియమాల ప్రకారం ఆయనకు లభించిన మొదటి ఆరు నెలల మినహాయింపు గడువు మే 20తో ముగిసిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా అని, చట్టసభ సభ్యత్వం లేని వ్యక్తికి మళ్లీ కొత్తగా మరో ఆరు నెలల సమయం లభిస్తుందా అనే అంశంపైనే ఇప్పుడు న్యాయపోరాటం నడుస్తోంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తోంది. దీని ప్రకారం చట్టసభ సభ్యుడు కాని వ్యక్తి వరుసగా ఆరు నెలల పాటు మాత్రమే మంత్రిగా కొనసాగేందుకు వీలుంటుంది. ఆ నిర్ణీత గడువులోగా అతను తప్పనిసరిగా రాష్ట్ర శాసనసభ లేదా శాసనమండలి సభ్యత్వాన్ని సాధించాలి. ఈ మినహాయింపు అనేది ఒక వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుందనీ.. కేవలం ముఖ్యమంత్రి మారినంత మాత్రాన లేదా కొత్త ప్రభుత్వం ఏర్పాటైనంత మాత్రాన ఈ రాజ్యాంగ నిబంధనను తుంగలో తొక్కి, ఆరు నెలల గడువును పునరుద్ధరించడం కుదరదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఒకవేళ ఇలాంటి నియామకాలను అనుమతిస్తే, ప్రజాస్వామ్య సూత్రాలకు విఘాతం కలుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ వాదనలతో ప్రాథమికంగా ఏకీభవిస్తూ, రెండోసారి ఇలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేస్తూ నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇలాంటి రాజకీయ నియామకాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.



.webp)


