Latest News
ఏపీ లిక్కర్ స్కాం నిందితులకు సుప్రీంలో ఎదురుదెబ్బ
posted on: Jan 21, 2026 2:00PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఈ కేసులో నిందితులకు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్‌ను రద్దుచేస్తూ.. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ, రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. కాగా ఈ కేసు బుధవారం (జనవరి 21) సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితులు తమకు బెయిల్ కావాలంటే సంబంధిత ట్రయల్ కోర్టులోనే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఆదేశించింది. అయితే, ఈ కేసులో నిందితులకు తక్షణమే అరెస్ట్ ముప్పు లేకుండా సుప్రీంకోర్టు ఉపశమనం కలిగించింది. గత నవంబర్ 26న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణ (ఇన్టీరియమ్ ప్రొటెక్షన్) ఉత్తర్వులు ప్రస్తుతం కొనసాగుతాయని తెలిపింది. ఒకవేళ ట్రయల్ కోర్టులో బెయిల్ రాకపోతే, తిరిగి హైకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా నిందితులకు నాలుగు వారాల పాటు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అంటే వచ్చే నెలరోజుల వరకు వారికి అరెస్ట్ నుంచి రక్షణ ఉంటుంది. ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థలు సకాలంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదని పేర్కొంటూ ట్రయల్ కోర్టు నిందితులకు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే.. దీనిపై ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఆ డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో నిందితులు హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేశారు. అయితే అక్కడా వారికి ఊరట లభించలేదు.






