నిమ్మగడ్డకు సుప్రీం షాక్.. రాకియాకు బకాయిల వివాదంపై మధ్యవర్తి నియామకం
posted on: Mar 17, 2026 10:11AM

వ్యాన్‌పిక్ ప్రాజెక్టు చుట్టూ అల్లుకున్న వివాదంలో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. రాస్ అల్ ఖైమా ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (రాకియా) దాఖలు పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈ వివాద పరిష్కారానికి ఇరు పక్షాల అంగీకారం మేరకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌ను మధ్యవర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కోర్టు గతంలోనే నిమ్మగడ్డ ప్రసాద్‌కు వ్యతిరేకంగా 500 కోట్ల రూపాయల రికవరీ డిక్రీ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును అమలు చేయాలంటూ రాకియా భారత న్యాయస్థానాలను ఆశ్రయించింది. అందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పుడు తుదిదశకు వచ్చిందని సుప్రీం ఉత్తర్వుల ద్వారా స్పష్టమౌతోంది. ఈ వివాదంలో సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు మధ్యవర్తిగా నియమితులపై జస్టిస్ లలిత్ మధ్యవర్తిత్వం సఫలమైతే సరే లేకుంటే మాత్రం నిమ్మగడ్డ ప్రసాద్ పై కఠిన చర్యలు ఉండే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.
ఇలా ఉండగా ఈ కేసులో ఇప్పటికే నిమ్మగడ్డ ప్రసాద్ సుప్రీంకోర్టులో నూటపాతిక కోట్ల రూపాయల నగదు డిపాజిట్ చేశారు. దీనికి అదనంగా, తెలంగాణలోని మేడ్చల్ జిల్లా దేవరయాంజల్ ప్రాంతంలో ఉన్న 37 ఎకరాల భూమికి సంబంధించిన అసలు పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఈ భూముల మార్కెట్ విలువ ఆరువందల కోట్ల రూపాయల పై మాటేనని అంచనా. మధ్యవర్తిత్వ ప్రక్రియ ముగిసే వరకు ఈ స్థిరాస్తులపై ఎలాంటి క్రయవిక్రయాలు జరపకూడదని, మూడో పక్షానికి బదలాయించకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. గతంలో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో వ్యాప్ పిక్ ప్రాజెక్టు కోసం రాకియా నుంచి సేకరించిన నిధులను నిమ్మగడ్డ ప్రసాద్ దారి మళ్లించారన్నది ప్రధాన ఆరోపణ. 20 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రాజెక్టు అవసరాలకు వాడకుండా, అప్పటి ముఖ్యమంత్రి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సంస్థల్లో క్విడ్ ప్రో కో పద్ధతిలో పెట్టుబడులుగా పెట్టారన్న అభియోగాలు ఉన్నాయి. ఈ అంశంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే.
అదలా ఉండగా మధ్యవర్తిత్వం విఫలమైతే మాత్రం నిమ్మగడ్డ కోర్టులో డిపాజిట్ చేసిన నగదు, భూములను రాకియాకు పరిహారంగా బదిలీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?






